మెలమెల్లగా కరోనా విశ్వరూపం జనాలకు కనిపిస్తోంది. ఒక్క పెరుగుతున్న బాధితుల సంఖ్య. మరోపక్క పెరుగుతున్న నిబంధనలు. ఇలా రెండు విధాలుగా కరోనా కష్టం జనాలకు కనిపిస్తోంది. ముందుగా మాల్స్ థియేటర్లు మూత. ఆ తరువాత ట్రయిల్ రన్ గా ఓ రోజు స్వచ్ఛంధ కర్ఫ్యూ. తరువాత దేశ వ్యాప్తంగా 80 జిల్లాల్లో లాకిన్.
కానీ సోమవారం ఈ నిబంధనలు మరింత టర్న్ తీసుకున్నాయి. జనాలు అంత సులువుగా వినరు అని అర్థం చేసుకున్న ప్రభుత్వం, చట్టాలు అమలు చేయడం ప్రారంభించింది. స్వచ్ఛంధ కర్ఫ్యూ పూర్తయిన కొద్ది గంటల్లోనే దేశ వ్యాప్తంగా జనాలు స్వేచ్ఛా విహంగాల్లా రోడ్ల మీదకు వచ్చేసారు. దీంతో ట్రాఫిక్ జామ్ లు దాదాపు ప్రతి నగరంలో కనిపించాయి.
దీంతో ప్రభుత్వాలకు మండుకొచ్చింది. తెలంగాణలో సాయంత్రం నుంచి తెల్లవారే వరకు కదలికలను నిషేధించారు. బయటకు వస్తే క్వారంటైన్ లో పెట్టేలా వుంది పరిస్థితి. పగటి పూట కూడా కాలనీల వరకు సంచారం కట్టుదిట్టం చేసారు. కరోనా మూడో స్టేజ్ కు చేరుకోకూడదు, నాలుగో స్టేజ్ కు వెళ్తే మనం నియంత్రించే స్థాయి దాటిపోయినట్లే. అందుకే ప్రభుత్వాలు ఇక కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించాయి
జనాలకు ఇప్పుడు కరోనా కష్టాలు మరింతగా తెలిసిరావడం ప్రారంభమైంది.