శ్రీధర్ కార్టూన్ లేని ఈనాడును చూడడం పాఠకులకు లోటే. ఈనాడు సగం బలం శ్రీధర్ కార్టూన్లే. ఈనాడు నుంచి శ్రీధర్ నిష్క్రమించిన తర్వాత కార్టూన్లు లేకుండానే నడవడం ఆశ్చర్యం. ఇటీవల మళ్లీ ఈనాడులో కార్టూన్ కనిపిస్తోంది. అయితే శ్రీధర్ కార్టూన్లకు ఇచ్చిన ప్రాధాన్యం లేకపోవడం గమనార్హం. ఎక్కడో లోపలి పేజీల్లో ఒక మూల కనిపించీ, కనిపించకుండా కార్టూన్‌ను ముద్రిస్తూ ఈనాడు ఎందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నదో అర్థం కాదు.
తాజాగా ఇవాళ సంచికలో సందర్భోచితంగా వేసిన కార్టూన్‌లోని వ్యంగ్యం శ్రీధర్‌ను గుర్తు తెచ్చింది. శ్రీధర్ అనే పేరు లేదు తప్ప అందులోని సెటైర్ మాత్రం ఆకట్టుకునేలా ఉంది. జగన్ సర్కార్‌పై తీవ్రమైన చురకే ఈ కార్టూన్.
పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ పరిధిలో వ్యాట్ తగ్గిస్తే వినియోగదారులపై పెనుభారం తగ్గుతుందని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈనాడులో వేసిన కార్టూన్ ఆలోచింపజేసేదిగా ఉంది. ఈ కార్టూన్‌లో ఏమున్నదంటే…
“డీజిల్ ధర ఏపీలోనే ఎక్కువ” -డీజిల్‌పై పన్ను ఎక్కువే
“పెట్రోల్ ధరలపై పన్ను తగ్గించనిది…. వాటి వినియోగం తగ్గించడానికే అని చెబుదాం సార్. నమ్మేస్తారు” అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఓ వ్యక్తి సలహా ఇస్తుండాన్ని కార్టూన్‌గా చిత్రీకరించారు. మద్యపానాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చిన జగన్… ఆ తర్వాత రెట్టింపు స్థాయిలో మందు ధరలను పెంచారు. మద్యపానాన్ని నిషేధించకపోగా, ఇదేం పని అని ప్రశ్నించగా… అధిక రేట్లు పెంచితే మద్యం కొనలేక దానికదే నిషేధం అవుతుందనే వైసీపీ సర్కార్ లాజిక్‌ను ఈ కార్టూన్‌లో వెటకారంగా ఆవిష్కరించారు.
పెట్రోల్, డీజిల్ ధరల విషయంలో మద్యపాన నిషేధ సూత్రాన్ని అమలు చేస్తామని జగన్‌కు ఓ సలహాదారుడు సలహా ఇస్తున్నట్టు కార్టూన్‌లో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఇదే ఈ కార్టూన్ ప్రత్యేకత. ఈ కార్టూన్ నవ్వు తెప్పించకుండా ఉండదు. జగన్ సర్కార్‌కు బాగా మొట్టికాయలు వేశారనే భావన కలుగుతుంది.