ద‌ళిత సీఎం.. ఎవ‌రికీ ఆస‌క్తి లేని అంశ‌మా!

'ద‌ళితుడిని సీఎంగా చేస్తాం.. ద‌ళితుడిని సీఎంగా చేశాం… ద‌ళితులు రాజ‌కీయంగా శ‌క్తిమంతం అవుదాం!' ఈ నినాదాలు త‌ర‌చూ వినిపిస్తుంటాయి రాజ‌కీయ పార్టీల నుంచి!  దేశంలోని ప‌లు పార్టీలు, వివిధ సంద‌ర్భాల్లో ఇచ్చిన‌, ఇస్తున్న నినాదాలే…

'ద‌ళితుడిని సీఎంగా చేస్తాం.. ద‌ళితుడిని సీఎంగా చేశాం… ద‌ళితులు రాజ‌కీయంగా శ‌క్తిమంతం అవుదాం!' ఈ నినాదాలు త‌ర‌చూ వినిపిస్తుంటాయి రాజ‌కీయ పార్టీల నుంచి!  దేశంలోని ప‌లు పార్టీలు, వివిధ సంద‌ర్భాల్లో ఇచ్చిన‌, ఇస్తున్న నినాదాలే ఇవి. కొంద‌రు ఈ నినాదాల‌ను నిలబెట్టుకున్నారు కూడా!

బిహార్ లో జిత‌న్ రామ్ మాంఝీ, మొన్న‌నే పంజాబ్ లో చ‌న్నీ.. గ‌త కొంత‌కాలంలో ద‌ళిత సీఎం అనే పొలిటిక‌ల్ ట్యాగ్ లైన్ తో పీఠం ఎక్కిన వారు.  విశేషం ఏమిటంటే.. వీరంతా ఆ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల చేత పూర్తిగా తిర‌స్క‌రించ‌బ‌డ్డారు! 

ద‌ళిత ఓట‌ర్ల‌ను సంఘ‌టితం చేసుకోవ‌డానికో, ద‌ళితుల‌ను రాజ‌కీయంగా ఆక‌ర్షించ‌డానికో.. లేదా నిజంగానే ద‌ళిత జ‌నోద్ధ‌ర‌ణ‌కో .. రాజ‌కీయ పార్టీలు ఈ నేత‌ల‌ను పీఠం ఎక్కించి ఉండ‌వ‌చ్చు గాక‌! అయితే అతి త‌క్కువ కాలంలోనే ఈ నేత‌లు ఎన్నిక‌ల‌ను ఎదుర్కొని చిత్త‌య్యారు! 

పంజాబ్ లో ద‌ళిత ఓట‌ర్ల శాతం చెప్పుకోద‌గిన స్థాయిలో ఉంద‌ని, చ‌న్నీని పీఠం ఎక్కించి కాంగ్రెస్ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఎన్నిక‌ల ముందు విశ్లేష‌కులు చెప్పుకొచ్చారు. అంతే కాదు.. ద‌ళిత సీఎంను ఏదో ఎన్నిక‌ల ముందు పీఠంలో కూర్చోబెట్ట‌డం కాదు, పంజాబ్ లో మ‌ళ్లీ కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆ ద‌ళిత నేత‌నే మ‌ళ్లీ సీఎంగా చేస్తామంటూ కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే.. పంజాబీ ద‌ళితుల‌కే ఆ ఆస‌క్తి లేదేమో!

కాంగ్రెస్ చిత్త‌య్యింది. చ‌న్నీ ఒక‌టికి రెండు చోట్ల చిత్త‌య్యారు. ద‌ళిత సీఎం నినాదానికి ద‌ళితుల జ‌నాభా గ‌ణ‌నీయంగా ఉన్న రాష్ట్రంలోనే మ‌ద్ద‌తు ల‌భించ‌న‌ట్టే క‌దా! ఇక బిహార్ కు కొంత కాలం పాటు సీఎంగా చేసిన జీత‌న్ రామ్ మాంఝీ ప‌రిస్థితి ఆ త‌ర్వాత ఏమయ్యిందో అంద‌రికీ తెలిసిందే!

అలాగే ద‌ళితుల ఓటు బ్యాంక్ తో ద‌శాబ్దాల పాటు చెప్పుకోద‌గిన ప్ర‌ద‌ర్శన చేసిన బీఎస్పీ ప్ర‌స్తుతం త‌న అడ్ర‌స్ వెదుక్కొనే ప‌నిలో ఉంది! యూపీలో భారీ ఎత్తున ద‌ళితులున్నారు. ద‌ళితుల‌పై అకృత్యాలు ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న రాష్ట్రం అది. మ‌రి ద‌ళితుల రాజ‌కీయ ఎదుగుద‌ల నినాదాన్ని గ‌ట్టిగా ఇవ్వ‌గ‌లిగిన బీఎస్పీ రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా గ‌ల్లంత‌య్యింది. ఎన్నో ఎస్సీ రిజ‌ర్వ్డ్ స్థానాలు ఉన్న రాష్ట్రాల్లో.. అలాంటి చోట కూడా ప‌రువు నిలుపుకోలేక‌పోవ‌డం నిస్సందేహంగా మారిన రాజ‌కీయ ముఖ‌చిత్రానికి నిద‌ర్శ‌నం!

ఈ ప‌రిస్థితుల నుంచి రాజ‌కీయ పార్టీలు నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే.. ద‌ళిత సీఎం, బీసీ సీఎం అనే నినాదాల‌ను స‌ద‌రు వ‌ర్గాలు కూడా ఏ మేర‌కు ప‌ట్టించుకుంటున్నాయో .. కొంత విశ్లేష‌ణ చేసుకోవాలి. ఫ‌లానా కుల‌స్తుడిని సీఎంగా చేస్తాం అనే హామీ ఆ కులాన్ని అయినా మెప్పిస్తోందా? ఫ‌లానా కుల‌స్తుడిని సీఎంగా చేస్తామ‌న‌డం క‌న్నా.. స‌మ‌ర్థుడిని సీఎంగా చేస్తామంటూ చెప్పుకుంటే ప్ర‌జ‌లు కాస్త ఆలోచిస్తారేమో!

ఆ మ‌ధ్య క‌ర్ణాట‌క కాంగ్రెస్ నేత మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ఒక ప్ర‌క‌ట‌న చేశారు. త‌న‌ను 'ద‌ళిత నేత‌' అనొద్దు అంటూ ఆయ‌న పార్టీ కేడ‌ర్ కు, మీడియాకు విజ్ఞ‌ప్తి చేశారు. త‌ను ఒక సామాజిక‌వ‌ర్గ నేత‌ను కాద‌ని ఆ సీనియ‌ర్ నేత చెప్పుకోవాల్సి వ‌చ్చింది. రాజ‌కీయంలో రోజులు మారాయ‌ని ప్ర‌జా తీర్పులు స్ప‌ష్ట‌త‌ను ఇస్తున్నాయి. దీన్ని పార్టీలు ఏ మేర‌కు అర్థం చేసుకుంటాయో మ‌రి.