వివేకా హ‌త్య కుట్ర‌దారుడు ఆయ‌నేః సీబీఐ

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో ప్ర‌ధాన కుట్ర‌దారుడు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డే అని సీబీఐ త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపిస్తోంది. అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య వివేకా హ‌త్య‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో ప్ర‌ధాన కుట్ర‌దారుడు దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డే అని సీబీఐ త‌న వాద‌న‌ను బ‌లంగా వినిపిస్తోంది. అనేక నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య వివేకా హ‌త్య‌పై సీబీఐ ద‌ర్యాప్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శివ‌శంక‌ర్‌రెడ్డి త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోర్టును ఆశ్ర‌యించ‌డం, ఒక‌వేళ ఇస్తే సాక్ష్యాల‌ను తారుమారు చేస్తార‌ని సీబీఐ వాదించ‌డం కీల‌క అంశాలుగా చెప్పుకోవ‌చ్చు. ఈ మేర‌కు న్యాయ స్థానంలో సీబీఐ త‌న వాద‌న‌ను బ‌లంగా వాదించింది. వివేకా హ‌త్యకు శివ‌శంక‌ర‌రెడ్డి ఏ విధంగా కుట్ర‌ప‌న్నాడో న్యాయ‌స్థానం ముందు సీబీఐ స‌మ‌గ్ర వివ‌రాలు పెట్టింది. క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి అత్యంత స‌న్నిహితుడు కావ‌డం గ‌మ‌నార్హం.

త‌న తండ్రి హ‌త్య కేసులో దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డితో పాటు కుటుంబ స‌భ్యుల్లో కొంద‌రి ప్ర‌మేయం వుందంటూ క‌డ‌ప ఎంపీ అవినాష్‌, ఆయ‌న తండ్రి వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి, వైఎస్ మ‌నోహ‌ర్‌రెడ్డి పేర్ల‌ను ప్ర‌ధానంగా డాక్ట‌ర్ సునీత చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ఆమె కోర్టులో అఫిడ‌విట్ కూడా దాఖ‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి ప్ర‌మేయంపై సీబీఐ కూడా అదే ర‌క‌మైన అభిప్రాయాల్ని వ్య‌క్తం చేస్తుండడం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

కడప నాలుగో అదనపు జిల్లా జడ్జి న్యాయస్థానంలో సీబీఐ వాద‌న‌ల్లోని అంశాలు మ‌రోసారి సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. వివేకా హ‌త్య కేసు ప్ర‌ధానంగా దేవిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి చుట్టూ తిరుగుతోంది. న్యాయ స్థానంలో సీబీఐ ఒక క్ర‌మ ప‌ద్ధ‌తిలో వాదించుకుంటూ …  ఆ హ‌త్య‌తో దేవిరెడ్డికి సంబంధః ఉంద‌ని నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తోంది. సీబీఐ వాద‌న‌లో ప్ర‌ధాన అంశాలు..

‘మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్యకు కుట్ర, ఆయన గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం చేయాలనే సిద్ధాంతానికి సూత్ర‌ధారి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి. రక్తపు మడుగులో వివేకా మృత‌దేహం ఉన్నా…  గుండెపోటుతో చనిపోయారంటూ ప్రచారం మొదలుపెట్టింది శివశంకర్‌రెడ్డే. వివేకా గుండెపోటుతోనే మరణించారంటూ అందర్నీ నమ్మించేందుకు పడక గది, స్నానపు గదిలోని రక్తపు మరకలన్నింటినీ తుడిపించేశారు. ఘటనా స్థలంలో  ఆధారాలు ధ్వంసం చేశారు’

‘ వివేకా గుండెపోటు, రక్తపు వాంతులతో చనిపోయారంటూ మేము చెబుతాం. ఈ వ్యవహారంలో నోరుమూసుకుని ఉండాలంటూ సీఐ శంకరయ్యను, ఘటనా స్థలంలోని సాక్షుల్ని శివశంకర్‌రెడ్డి దుర్భాషలాడారు. ఈ కేసులో ఇటీవ‌ల కొత్త పేర్లు తెర‌పైకి తీసుకొస్తున్నారు. ద‌ర్యాప్తును ప‌క్క‌దారి ప‌ట్టించేందుకే ఇదంతా చేస్తున్నారు’

‘సీబీఐ ఎదుట నా పేరు కానీ, మిగతా వారి పేర్లు కానీ చెప్పొద్దు. అలా చేస్తే నీ జీవితాన్ని సెటిల్‌ చేస్తా అంటూ దస్తగిరితో శివ‌శం క‌ర్‌రెడ్డి చెప్పారు’ అని సీబీఐ త‌న వాద‌న‌ను న్యాయ స్థానం ముందు ఉంచింది. శివ‌శంక‌ర్‌రెడ్డికి కోర్టు బెయిల్ ఇవ్వ‌లేదు.