మంత్రి సురేష్ దంప‌తుల‌కు షాక్‌

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ దంప‌తుల‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ ద‌ర్యాప్తున‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో సురేష్ దంప‌తుల‌కు సీబీఐ విచార‌ణ ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి…

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ దంప‌తుల‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ ద‌ర్యాప్తున‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. దీంతో సురేష్ దంప‌తుల‌కు సీబీఐ విచార‌ణ ఎదుర్కోవాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు మంత్రి సురేష్ స‌న్నిహితుడు. అందుకే ఆయ‌న‌కు కీల‌క విద్యాశాఖ‌ను అప్ప‌గించారు.

ఆదిమూల‌పు సురేష్ రాజ‌కీయాల్లోకి రాక‌ముందు ఐఆర్ఎస్ అధికారి. ఆయ‌న భార్య విజయలక్ష్మి కూడా ఐఆర్ఎస్ అధికారిణి. మంత్రి దంపతుల‌పై ఆదాయానికి మించి ఆస్తులు క‌లిగి ఉన్నార‌ని సీబీఐ 2016లో కేసు న‌మోదు చేసింది. 2017లో ఎఫ్ఐఆర్ కూడా న‌మోదైంది. త‌మ‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌డంపై ఆదిమూల‌పు సురేష్ దంప‌తులు తెలంగాణ హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

సీబీఐ ఆరోప‌ణ‌ల‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ  అఫిడవిట్‌లో లోపాలున్నాయ‌ని, మరోసారి ప్రాథమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశాలిచ్చింది. అనంత‌రం ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టు చేరింది. జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తుది తీర్పునిచ్చింది. 

హైకోర్టు చెప్పిన‌ట్టు ప్రాథమిక విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. తదుపరి విచారణ దర్యాప్తు కొనసాగించేందుకు సీబీఐకి అనుమతించింది. దీంతో జ‌గ‌న్ కేబినెట్‌లో మంత్రి సీబీఐ విచార‌ణ ఎదుర్కోవాల్సి వ‌చ్చింది.