వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ టికెట్లలో 40 శాతం యువతకే కేటాయిస్తారట ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు! ఇంకేం మరి.. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారో, వ్యాపారం ప్రారంభించాలనుకునే వారో, లేదంటే.. సమాజ సేవనే కెరీర్ గా ఎంచుకోవాలనుకునే వారో.. రాజకీయంగా తెలుగుదేశం పార్టీతో చేరితే సరి!
ఏకంగా నలభై శాతం టికెట్లు యువతకేనట! అంటే రమారమీ.. 70 అసెంబ్లీ టికెట్లు యువతకే! మరి ఇంతకీ ఎవరా యువత? అనేదే అసలు ప్రశ్న! 40 శాతం యువతకు ఇస్తారు సరే.. ఇంతకీ వారు ఎవరు? టీడీపీలోని ఏ సీనియర్ నేతల పుత్ర, పుత్రికారత్నాలు వారు.. అనేది సులువుగా సమాధానం దొరికే ప్రశ్న!
టీడీపీకే 40 యేళ్లు వచ్చాయి. ఆ పార్టీలో ఇన్నేళ్లూ పనిచేసిన చాలా మంది నేతలు వృద్ధులు అయిపోయారు. కొందరు పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నా.. ప్రజామోదం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వారి తనయులు, మనవళ్లు రాజకీయంగా ఉనికిని కోరుకుంటున్నారు. గత ఎన్నికల్లోనే.. టీడీపీ తరఫున చాలా మంది వారసులు పోటీ చేశారు.
అయితే వారిలో చంద్రబాబు రాజకీయ వారసుడితో సహా అంతా చిత్తయ్యారు. అయినా.. వారు తప్ప టీడీపీకి వేరే గతి లేదు. 40 శాతం యువతకు అంటున్నది.. లోకేష్ లాంటి వారసులుకు గాక, మరెవరికో అనుకోవడం భ్రమ.
ముందు తన వారసుడిని పార్టీ పరంగా భావి నేతగా నిలబెట్టుకోవాలంటే.. పార్టీలోని సీనియర్ నేతల వారసులకు కూడా చంద్రబాబు ప్రాధాన్యతను ఇచ్చి తీరాలి. లేకపోతే.. ఎదురుతిరుగుతారు. అందుకే ఈ నలభై శాతం యువత ప్రకటన కాబోలు!