తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రమైన ఇరకాటంలో ఉన్నారు. ఏదో అనుకూల మీడియా ఉంది కాబట్టి.. తెలుగుదేశం పార్టీ తొండి వాదనలను వినిపించగలుగుతోంది. లేకపోతే ఒక పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో.. నియోజకవర్గ కేంద్రం అయిన మున్సిపాలిటీని కోల్పోవడం అంటే.. అంతకు మించిన అవమానం మరోటి ఉండదు.
అందులోనూ ఆ నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు ముప్పై యేళ్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి చోట గత ఎన్నికల్లో మెజారిటీ తగ్గిపోయింది, ఆ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అడ్రస్ గల్లంతయ్యింది. ఇక ఇప్పుడు కుప్పం మున్సిపాలిటీలో ఎంతో ప్రయత్నిస్తే.. దక్కింది ఆరు వార్డులు!
ఈ ఓటమికి టీడీపీ అనేక రకాలు సాకులు చెబుతోంది. ఆ పార్టీ చెప్పగలదు. ఒకరేమో దొంగ ఓట్ల వల్ల అంటారు. మరొకరేమో అసలు కుప్పం తమకు లెక్కలోనే లేదన్నారు! అయితే ఇవన్నీ కాకమ్మ కథలే. కుప్పం మున్సిపాలీలో తమ పార్టీ విజయం కోసం చంద్రబాబు అక్కడకు వెళ్లింది నిజం. వంగి వంగి దండాలు పెట్టింది నిజం.
ఎన్నికల ప్రచార సమయంలో.. లోకేష్ వెళ్లి అది తమ దేవుడి నియోజకవర్గం అని, చంద్రబాబుపై దాడి జరుగుతోందన్నట్టుగా సానుభూతిని పొందేందుకు కూడా ప్రయత్నాలు చేశారు. ఇక అంగ, అర్థబలంలో కుప్పంలో టీడీపీకి ఎలాంటి లోటూ లేదు. అయినా.. కనీసం మున్సిపల్ పీఠాన్ని సొంతం చేసుకోలేకపోయింది.
మరి ఈ పరిస్థితుల్లో బాగా చర్చ జరిగే అంశం, చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు! 72 యేళ్ల వయసులోని వ్యక్తి రాజకీయ భవితవ్యం ఏమిటనే చర్చ జరగడమే విడ్డూరమైన అంశం. వచ్చేసారి చంద్రబాబుకు కుప్పం నుంచి పోటీ చేసే ధైర్యం ఉందా? అనేది ఆసక్తిదాయకమైన ప్రశ్న.
కుప్పం నుంచి పోటీ చేస్తే విజయం కోసం చంద్రబాబు ఏటికి ఎదురీదాల్సి ఉంటుందని స్పష్టం అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఎమ్మెల్యేగా ఓడించి ఆయనకు చాలా ఘనమైన వీడ్కోలు ఇవ్వాలనే ప్రణాళికతో ఉందని స్పష్టం అవుతోంది.
ఇక కుప్పం నుంచి కాకుండా.. ఏ పెనమలూరు నుంచినో, కమ్మవాళ్ల జనాభా గట్టిగా ఉన్న నియోజకవర్గం నుంచినో పోటీ చేయాలని చంద్రబాబు వెళితే.. అది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓటమికి నాంది అవుతుంది! అధినేతే ఓటమి భయంతో.. వేరే నియోజకవర్గానికి వెళ్లారంటే.. అది టీడీపీ క్యాడర్ కు డేంజర్ సిగ్నల్స్ ను పంపుతుంది.
ఒకవేళ కుప్పంతో పాటు మరో నియోజకవర్గంలో పోటీ చేస్తే… అది కూడా ఓటమి భయానికి నిదర్శనం. చంద్రబాబే రెండు చోట్ల నామినేషన్ వేస్తే.. ఆయనకే గెలుపు పై ధీమా లేకపోతే రాష్ట్రంలో టీడీపీ తరఫున నియోజకవర్గాల వారీగా నామినేషన్లు వేసే వారి పరిస్థితి ఏమిటి? ఏతావాతా.. కుప్పం పరిస్థితులు చంద్రబాబుకు ముందు నుయ్యిని, వెనుక గొయ్యిని చూపిస్తున్నాయి.