ఒకవైపు జూన్, జూలై నెలల్లో దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు కొంతమంది మేధావులు. కరోనా విషయంలో మేధావుల మాటలు కూడా కేవలం చిలక జోస్యాల వలే ఉంటాయి. ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఎవరికి తోచింది వారు చెబుతూ ఉన్నారు. ఇందులో పెద్దగా ఆశ్చర్యం లేదు కూడా. కరోనా వైరస్ ఎలా ప్రవర్తిస్తుందో, ఎవరి మీద ఎలా ప్రభావం చూపుతుందో ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో కరోనా దేశంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై కూడా భిన్నవాదనలు వినిపిస్తూ ఉన్నాయి.
కొందరేమో ఆల్రెడీ ఇండియాలో కరోనా పీక్ స్టేజీలను దాటేసిందని, ఇక నుంచి అంత ప్రభావం ఉండదని అంటున్నారు. మరి కొందరు చలికాలం వస్తే ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. ఎవరికి తోచింది వారు అనడం, మిగతా వాళ్లు వినడం తప్ప ఇంకా పూర్తి స్పష్టత ఎవరికీ లేదు.
ఆ సంగతలా ఉంటే.. టెన్త్ పరీక్షల తేదీలను ప్రకటించింది సీబీఎస్ఈ. జూలై ఒకటో తేదీ నుంచి టెన్త్ పరీక్షలను నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించింది. జూలై ఒకటి నుంచి 15వ తేదీ వరకూ పరీక్షలు జరుగుతాయని చెప్పింది. కరోనా లాక్ డౌన్ తో టెన్త్ పరీక్షలు పెండింగ్ లో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ తేదీలను ప్రకటించి విద్యార్థులను ఎగ్జామ్స్ కు రెడీ కావడానికి సమాయత్తం చేస్తోంది. అయితే జూలై ఒకటికి చాలా రోజుల సమయం అయితే ఉంది. ముందుగానే విద్యార్థులను అలర్ట్ చేయడం బాగానే ఉంది కానీ, అప్పటికి దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందో!