కేటాయింపు రూ.3562 కోట్లు, విడుదలైంది రూ.1021

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అయిదు జాతీయస్థాయి విద్యా సంస్థలకు శాశ్వత భవనాలు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం మొత్తం 3,562 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటివరకు 1021 కోట్లు విడుదల చేసినట్లు…

ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అయిదు జాతీయస్థాయి విద్యా సంస్థలకు శాశ్వత భవనాలు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం మొత్తం 3,562 కోట్ల రూపాయలు కేటాయించగా ఇప్పటివరకు 1021 కోట్లు విడుదల చేసినట్లు మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియల్‌ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పొందుపరచిన హామీలను అనుసరించి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఐఐటీ, తాడేపల్లిగూడెంలో ఎన్‌ఐటీ, కర్నూలులో ట్రిపుల్‌ ఐటీ, విశాఖపట్నంలో ఐఐఎం, తిరుపతిలో ఐఐఎస్‌ఈఆర్‌ సంస్థలను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. ఈ అయిదు జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు కోసం మొత్తం 3,526 కోట్లు కేటాయించగా ఇప్పటి వరకు 1,688 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. మంజూరు చేసిన మొత్తంలో 1021 కోట్లు విడుదల చేయగా 776 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ అయిదు విద్యా సంస్థలతోపాటు అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్శిటీ, విజయనగరంలో సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు.

అనంతపురంలోని సెంట్రల్‌ యూనివర్శిటీ తొలి దశ నిర్మాణం కోసం 450 కోట్లు కేటాయిస్తూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2018-19 సంవత్సరంలో 10 కోట్లు కేటాయించగా 8 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు మంత్రి చెప్పారు. అలాగే విజయనగరంలో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్‌ ట్రైబల్‌ యూనివర్శిటీ నిర్మాణం తొలిదశ కోసం 420 కోట్ల కేటాయింపుకు మంత్రివర్గం ఆమోదం తెలపగా అందులో 10 కోట్లు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

ఇక తిరుపతిలోని ఐఐటీ శాశ్వత భవనాలు, ప్రాంగణం నిర్మాణం పనులు మార్చి 2020 నాటికి, తాడేపల్లిగూడెంలోని ఎన్‌ఐటీ క్యాంపస్‌ నిర్మాణ పనులు డిసెంబర్‌ 2020 నాటికి, కర్నూలులోని ట్రిపుల్‌ ఐటీ ఇప్పటికే శాశ్వత ప్రాంగణంలోకి మారగా విశాఖపట్నంలోని ఐఐఎం క్యాంపస్‌ నిర్మాణం జూన్‌ 2021 నాటికి, తిరుపతిలోని ఐఐఎస్‌ఈఆర్‌ నిర్మాణం డిసెంబర్‌ 20121 నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వివరించారు.

ఫిల్మ్ నగర్ అయిపోయే.. ఇప్పుడు వయా ముంబై

ఎవరిది పిచ్చోడి చేతిలో రాయి పాలన అవుతుంది!