స్వదేశీ పరిశ్రమకు ఊతం ఇవ్వాలని, విదేశీ వస్తువులు మీద ఆధారపడటం తగ్గించాలని ఇటీవలే భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే స్వదేశీ పరిశ్రమకు ప్రభుత్వాలే ఊతం ఇవ్వడం లేదని, దేశీయంగా తయారీ రంగం పట్ల భారతీయులకే పెద్ద ఆసక్తి లేకుండా పోయిందనే అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో భారత ప్రభుత్వం విపరీత స్థాయి దిగుమతులు ఉన్న కొన్నింటి మీద దృష్టి పెట్టిందట. వాటికి సంబంధించి అనవసరమైన దిగుమతులను తగ్గించాలని డిసైడ్ అయ్యిందట! 'అనవసరమైన దిగుమతులు' అనే విభాగాన్ని తయారు చేస్తోందట కేంద్ర ప్రభుత్వం. ఇండియాలో మనం తయారు చేసుకోగలిగినా, విదేశాల నుంచి దిగుమతి అవుతున్న వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టిందట.
సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్ అండ్ గార్మెంట్స్ వంటి వాటి మీద ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టిందట. దేశంలో సెల్ ఫోన్-స్మార్ట్ ఫోన్ తయారీ యూనిట్లు చాలా ఉన్నాయి. అయితే చాలా వరకూ ఇక్కడ అసెంబుల్ మాత్రమే చేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా మారాలని, కొన్ని రకాల ప్రాసెసర్ల దిగుమతులను కూడా ప్రభుత్వం తగ్గించబోతోందట. దీని వల్ల వాటి తయారీ కూడా ఇక్కడే జరగాలనేది ఉద్దేశం!
ఒక ఉదాహరణగా చెప్పాలంటే.. ఎలక్ట్రానిక్స్ కు సంబంధించి ఏసీల పరిశ్రమ మీద ప్రభుత్వం దృష్టి నిలిపిందట. దేశంలో ఏసీ ల అమ్మకాలు-కొనుగోలు పరిశ్రమ విస్తృతి పెద్దదే. 12 వేల కోట్ల రూపాయల స్థాయి మార్కెట్ జరుగుతుందట ఏటా. ఏసీలు చాలా వరకూ ఇక్కడే తయారవుతున్నాయి. అయితే వాటిల్లోని ప్రధాన ప్రాసెసర్లు దిగుమతి. వాటి విలువ మొత్తం ఏసీ మార్కెట్ లో 60 శాతం ఉంటుందట! అలా ఏసీలు స్వదేశీ మేకింగే అయినా, మెజారిటీ వాటా మాత్రం దిగుమతి వస్తువుల మీదే ఆధారపడింది. ఈ నేపథ్యంలో ఆ ప్రాసెసర్ల దిగుమతులను నియంత్రించనుందట ప్రభుత్వం. ఇవి ప్రధానంగా జపాన్, తైవాన్ వంటి దేశాల నుంచి వస్తున్నాయి.
అయితే ఇక్కడ రెండు రకాల ఇబ్బందులున్నాయి. ఆయా దేశాలతో ఇండియాకు స్వేచ్ఛావాణిజ్య ఒప్పందాలున్నాయి. ఇప్పుడు దిగుమతులపై నియంత్రణ అంటే, ఆ దేశాలు అభ్యంతరాలు చెప్పే అవకాశాలు లేకపోలేదు. ఇండియా కూడా ఎంతో కొంత ఆ దేశాలకు ఎగుమతులు చేస్తూ ఉంటుంది. మనం వాటిపై నిషేధం పెడితే, వాళ్లు మనపై ఆంక్షలు పెట్టవచ్చు!
ఇక రెండోది నాణ్యతతో కూడిన తయారీ. జపాన్ నుంచి ఏసీ ప్రాసెసర్ల నిషేధం పెట్టారనే అనుకుందాం. అందుకు తగ్గట్టుగా ధీటైన ప్రాసెసర్ల తయారీ ఇండియాలో జరగాలి. అప్పుడే వినియోగదారుడికి నాణ్యతతో కూడిన ఏసీ అందుతుంది. అలా కాకుండా.. జపానోడికి పగ్గాలు వేశారని, మనోళ్లు నాణ్యతలేమి ప్రాసెసర్లతో కూడిన ఏసీలను మార్కెట్లోకి తీసుకు వస్తే అంతిమంగా నష్టపోయేది వినియోగదారుడు. ఈ విషయాలన్నింటినీ సీరియస్ గా తీసుకుని, అన్నింటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడే దిగుమతులపై నిషేధం చెల్లుబాటు అవుతుంది. అలా కాకపోతే వ్యవహారం రెంటికీ చెడ్డ రేవడీ కాగలదు!