విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మడం పారదర్శకం అని, వ్యూహాత్మకం అని అన్నారు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్. నీతి అయోగ్ సూచనలు, సలహాల మేరకు పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ పని జరుగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ రంగ వ్యవస్థలను సంస్కరించుకోవడంలో భాగంగా వ్యూహాత్మకంగానే ఇది జరుగుతోందని చెప్పుకొచ్చారు.
ఏతావాతా ప్రైవేట్ పరం చేయడమే.. వ్యూహం తప్ప మరోటి తమ ప్రభుత్వానికి చేతకాదని ఈ కేంద్ర మంత్రి చెప్పుకొచ్చారు. అమ్మకాలకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి బడ్జెట్ లో ప్రతిపాదనలు చేస్తే.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి దాన్ని సమర్థించారు.
ఒకవైపు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సహించేది లేదని ఉద్యోగులు, రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం తమ ప్రతిపాదనను వెనక్కు తీసుకునే ఆలోచనే లేదని స్పష్టం చేసింది.
కంపెనీలను లాభసాటిగా నడపడం అంటే.. అది తమ ప్రభుత్వానికి చేతనయ్యే పని కాదని మోడీ ప్రభుత్వం ఇలా స్పష్టం చేస్తోంది. నీతిఅయోగ్ సూచనలు అంటూ బరువైన పదం వాడుతూ.. ప్రైవేటీకరణను సమర్థించుకుంటూ ఉంది.
ఇక ఈ అంశంపై కిక్కురుమనడం లేదు ఏపీ పార్టీలు. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. విశాఖ ఉక్కును కొనుగోలు చేసే ప్రతిపాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కేవలం కేంద్రాన్ని ఆపలేని అశక్తత.
ఇక చంద్రబాబు , టీడీపీ నేతలు కేంద్రంపై కిక్కురుమనడం లేదు. జగన్ ఆ కంపెనీని కొనాలని చూస్తున్నాడనేది టీడీపీ వాదన. ఏ వాదనకు హేతుబద్ధత ఏమిటో కానీ.. వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే ఆ కంపెనీని తుక్కు కింద మార్చి లక్ష కోట్లకు అమ్ముకోవాలని జగన్ అనుకుంటున్నారని స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించడమే సిసలైన కామెడీ.
కేంద్రంపై స్పందించే ధైర్యం లేక.. కేంద్రానికి ఒక లేఖ రాసే సాహసం కూడా చేయలేక ఈ పోచికోలు వాదనలతో పబ్బం గడపాలని చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తూ ఉండటం ఆయన రాజకీయ జీవితం చరమాంకంలోని మరో పతనావస్థ.