అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పనిచేస్తోందని ఆ సంస్థ చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి అన్నారు.
ఢిల్లీలో అసోచామ్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన స్కిల్ ఇండియా సమిట్ అండ్ అవార్డ్స్ లో దేశంలోనే అత్యత్తుమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచి బంగారు పథకం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ మేరకు శుక్రవారం తాడేపల్లిలోని ఎపిఎస్ఎస్డిసి కార్యాలయంలో చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, అనంత రాము ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఎండి, సీఈవో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
మొదట ఎపిఎస్ఎస్డిసి చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే యువతకు స్థానకంగా ఉండే పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు కల్పించేలా చట్టం చేశారని.. అందుకు అనుగుణంగానే నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించడం కోసం స్కిల్ యూనివర్సిటీతోపాటు ప్రతి లోక్ సభ నియోజకవర్గంలో ఒక మల్టీ స్కిల్ డెవప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారన్నారు. అందుకు అనుగుగుణంగా ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేస్తుననామని చెప్పారు. ఎపిఎస్ఎస్డిసి పాఠశాల స్థాయి నుంచి ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల్లో అనేక రకాల నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. విదేశాల్లో నర్సింగ్ ఉద్యోగాలకు మంచి డిమాండ్ ఉండడంతో ఇటీవలే యుకె నేషనల్ హెల్త్ సిస్టమ్స్, హెల్త్ ఎడ్యుకేషన్ ఇంగ్లండ్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇలాంటి అనేక నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు అమలు చేయడం వల్లే అసోచామ్ సంస్థ దేశంలోనే అత్యుత్తమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీకి మొదటి స్థానం ఇచ్చి బంగారు పతాకాన్ని ఇఛ్చిందన్నారు. ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందని.. రాబోయే రోజుల్లో యవతకు నైపుణ్య శిక్షణతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని చల్లా మధుసూదన్ రెడ్డి చెప్పారు.
అనంతరం ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, అనంత రాము గారు మాట్లాడుతూ.. దేశంలో అత్యత్తుమ నైపుణ్య శిక్షణ ఇస్తున్న రాష్ట్రాల్లో ఏపీని నెంబర్ వన్ గా అసోచామ్ సంస్థ గుర్తించి బంగారు పతకాన్ని ప్రదానం చేయడం ఆనందంగా ఉందన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని.. ఇందుకోసం విద్యావిధానంలో అనేక మార్పులు తీసుకువస్తున్నారని చెప్పారు. నైపుణ్య రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖలు నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణా కార్యక్రమాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణా శాఖను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. స్థానికంగా యువతకు 75శాతం ఉద్యోగాలు కల్పించడం కోసం అవసరమైన విధంగా యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ యూనివర్సిటీ, 25 మల్టీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. చదువుతోపాటు పరిశ్రమల్లో పనిచేయడానికి అవసరమైన ప్రాక్టికల్ శిక్షణ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని.. ఇందులో పరిశ్రమలు కూడా భాగస్వామ్యం అయ్యేలా చర్యలు తీసకుంటామన్నారు.
అనంతరం ఎపిఎస్ఎస్డిసి ఎండి, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఈ 6 నెలల కాలంలో ఎపిఎస్ఎస్డిసి శిక్షణా కార్యక్రమాలను అమలు చేశామన్నారు. శిక్షణతోపాటు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జరిపిన సర్వేలో 7 ఇండస్ట్రియల్ జోన్లను గుర్తించామని.. ఆప్రాంతాల్లోని పరిశ్రమల్లో ఉండే ఉద్యోగాలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలు అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. ఈ దిశగా ఇప్పటికే పరిశ్రమలశాఖ, విద్యాశాఖ, ఆర్థికశాఖ మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యామని చెప్పారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలైన పిఎంకెవివై, ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ డిజైన్ అండ్ మ్యానుఫాశ్చురింగ్ (ఈ.ఎస్.డి.ఎం), బ్యాంబు మిషన్, కోయిర్ బోర్డు, నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు (ఎన్.ఎఫ్.డి.బి) పథకాలను అమలు చేస్తూ నిధులను సమకూర్చుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 525 డిగ్రీ కాలేజీల్లో ఎంప్లాయిబిలిటీ స్కిల్స్ సెంటర్లు (ఈ.ఎస్.సి)లను ఏర్పాటు చేసి పైథాన్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ లాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఈ నాన్ టెక్నికల్ విద్యార్థులను ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు సాప్ట్ వేర్ సంస్థలు కూడా ముందుకు వస్తున్నాయన్నారు. గత వారం రోజుల్లో విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఇన్ఫోసిస్ సంస్థ నిర్వహించిన అర్హత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఎపిఎస్ఎస్డిసి ద్వారా శిక్షణ పొందిన 662 మంది ఉద్యోగాలు సాధించారని.. గుంటూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోనూ త్వరలో ఇన్ఫోసిస్ కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించబోతున్నామని అర్జా శ్రీకాంత్ తెలిపారు.
ఈ సమావేశంలో చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, అనంత రాము ప్రిన్సిపల్ సెక్రెటరీ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్, డాక్టర్ అర్జా శ్రీకాంత్ ఎండి, సీఈవో తోపాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హనుమ నాయక్, డాక్టర్ బి. నాగేశ్వరరావు, సీజీఎం టెక్నికల్ డాక్టర్ రవి గుజ్జుల, సీజీఎం కార్పొరేట్ కనెక్ట్ సత్యప్రభ, కంపెనీ సెక్రెటరీ పవన్ కుమార్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ప్రతాప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.