ఆ విధంగా కరోనా నుంచి బైటపడ్డ చంద్రబాబు

చంద్రబాబుకీ దావోస్ సదస్సులకీ అవినాభావ సంబంధం ఉందన్న విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం-దావోస్ లో ప్రతి ఏటా జనవరిలో జరిపే ఈ సదస్సుకి బాబు ఠంచనుగా హాజరవుతుంటారు, అది కూడా…

చంద్రబాబుకీ దావోస్ సదస్సులకీ అవినాభావ సంబంధం ఉందన్న విషయం ఏపీ ప్రజలందరికీ తెలుసు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం-దావోస్ లో ప్రతి ఏటా జనవరిలో జరిపే ఈ సదస్సుకి బాబు ఠంచనుగా హాజరవుతుంటారు, అది కూడా ప్రజల సొమ్ముతో. అక్కడికి వెళ్లి రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు సాధించుకొచ్చామని చెప్పే బిల్డప్ లకు మాత్రం అంతూ పొంతూ ఉండదు.

తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఏడాదీ వరుసగా దావోస్ సదస్సులకి వెళ్లిన చంద్రబాబుకి గతేడాది కేంద్రం షాకిచ్చింది. దావోస్ పర్యటనకి వెళ్లే టీమ్ మెంబర్ల సంఖ్యను కుదిస్తూ విదేశాంగ శాఖ ఓ లేఖ రాయడంతో.. చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. బీజేపీ తనపై కక్షసాధిస్తోందంటూ మండిపడ్డారు. అయితే తన బదులు కొడుకు లోకేష్ ని పంపించి, చినబాబు విన్యాసాలను ప్రజలు తిలకించేలా చేశారు.

అయితే ఈ ఏడాది జరిగిన సమావేశానికి అధికారంలో లేకపోవడంతో వెళ్లలేకపోయారు చంద్రబాబు. అధికారం కోల్పోవడం, దరిమిలా దావోస్ కి వెళ్లే అవకాశం కోల్పోవడం ఒక రకంగా చంద్రబాబుకి మేలు చేసింది. ఈ ఏడాది దావోస్ సమావేశానికి వెళ్లిన చాలామంది ప్రముఖులు కరోనా దెబ్బకి భయపడ్డారు. చైనాలో కరోనా గతేడాది నవంబర్ లోనే బయటపడింది. ఇతర దేశాలకు అది పాకకపోయినా.. చైనా నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలకు అందరూ దూరం దూరంగా ఉన్నారు.

దావోస్ లో సమావేశాలు ప్రారంభమయ్యేనాటికి ( ఈ ఏడాది జనవరిలో) చైనాలో కరోనా అప్పుడప్పుడే విస్తరిస్తోంది. కేసుల సంఖ్య అప్పటికి వందల్లోనే ఉంది. మిగతా దేశాలకు ఇంకా వ్యాప్తి చెందలేదు. అయినప్పటికీ చైనా పారిశ్రామికవేత్తలు, రాజకీయనాయకులు దావోస్ కు వచ్చారు కాబట్టి.. మిగతావాళ్లంతా స్వచ్ఛందంగా ఎవరికివారు సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ముందుచూపుతో వ్యవహరించడం వల్ల వాళ్లంతా బయటపడ్డారు.

చంద్రబాబు టీమ్ కూడా ఈ ఏడాది దావోస్ సమ్మిట్ కి వెళ్లి ఉంటే.. 60 దాటిన బాబుకు కచ్చితంగా కరోనా వైరస్ సోకి ఉండేది. అలా జరిగి ఉంటే దేశానికి కరోనాని తీసుకొచ్చిన అపప్రధను చంద్రబాబు టీమ్ మూటగట్టుకుని ఉండేది. విదేశీ కంపెనీలు.. అంటూ వెంటపడే బాబుకి విదేశీ రోగం కూడా అంటుకుని ఉండేది. ఈసారి సమావేశాలకు జగన్ సర్కార్ నుంచి ఎవ్వరూ వెళ్లలేదు.

అధికారం ఊడగొట్టి, చిత్తు చిత్తుగా ఓడించి, సీఎం పీఠం నుంచి దింపేసి.. ఈ ముదిమి వయసులో చంద్రబాబు కరోనా బారిన పడకుండా ఒకరకంగా జగనే కాపాడినట్టయింది. ఆ విధంగా తనను కరోనా బారి నుంచి కాపాడినందుకు జగన్ కు చంద్రబాబు థ్యాంక్స్ చెప్పాలి.

ఆంధ్రాలో కRoన ని జయించిన యువకుడు