చంద్రబాబు ప్లాన్-బి.. ఇకపై అన్నీ రోడ్లపైనే!

ఛలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగులు ఏం సాధించారో తెలీదు కానీ, చంద్రబాబుకు మాత్రం ఈ కార్యక్రమం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇన్నాళ్లూ కరోనా వల్ల జూమ్ లోనే పడకేసిన బాబు.. ఇప్పుడు రోడ్లపైకి రావాలని నిర్ణయించుకున్నారు. …

ఛలో విజయవాడ కార్యక్రమంతో ఉద్యోగులు ఏం సాధించారో తెలీదు కానీ, చంద్రబాబుకు మాత్రం ఈ కార్యక్రమం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇన్నాళ్లూ కరోనా వల్ల జూమ్ లోనే పడకేసిన బాబు.. ఇప్పుడు రోడ్లపైకి రావాలని నిర్ణయించుకున్నారు. 

ఉద్యోగుల 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి ఎలాగైతే ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతిచ్చాయో.. అలా ప్రతిపక్షాలన్నీ మద్దతిచ్చే అంశాల్ని భుజానికెత్తుకొని రోడ్లపైకి రావాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఇన్నాళ్లూ ఎన్నికల పొత్తు కోసం వెంపర్లాడిన బాబు, ఇప్పుడిలాంటి కార్యక్రమాలతో పొత్తులకు మార్గం సుగమం చేసుకోవాలనుకుంటున్నారు.

అయితే ఇక్కడ ఒకటే సమస్య. ఉద్యోగుల సమస్యల కాబట్టి అన్ని ప్రతిపక్ష పార్టీలు మద్దతిచ్చాయి, స్థానిక ప్రజలు-పోలీసులు కూడా సహకరించారు. మరి చంద్రబాబు ఎత్తుకునే అంశాలకు ఈ స్థాయి మద్దతు దక్కుతుందా?

టీడీపీ చేయలేనిది ఉద్యోగులు ఎలా చేయగలిగారు..?

ఇప్పటివరకు టీడీపీ కూడా చాలా చోట్ల నిరసనలు చేపట్టింది, ఆందోళనలు మొదలు పెట్టింది. అంతెందుకు అమరావతి పాదయాత్రకు కూడా ఎక్కడలేని ప్రయారిటీ ఇచ్చింది. టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కూడా పాదయాత్రలో అక్కడక్కడా వారితో కలిశారు, వారి అనుకూల మీడియా కూడా ఆహా ఓహో అంటూ ఎత్తేసింది. కానీ అవన్నీ ఒకెత్తు, ఇటీవల జరిగిన చలో విజయవాడ మరో ఎత్తు. 

సోషల్ మీడియాలో ఆ వీడియోలు, ఫొటోలు హోరెత్తిపోయాయి. అంత అటెన్షన్ క్రియేట్ చేసింది చలో విజయవాడ. మరి ఈ విషయంలో ఈ రెండున్నరేళ్లు టీడీపీ ఎందుకు వెనకబడిపోయింది. మన కార్యక్రమాలకు జనం ఎందుకు రావడంలేదు, మనం అంత పెద్ద ఎత్తున ఎందుకు జనాల్లోకి వెళ్లలేకపోయామనేది టీడీపీలో తాజాగా జరిగిన స్ట్రాటజీ మీటింగ్ లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా జరిగిన ఈ మీటింగ్ లో చంద్రబాబు చర్చ మొత్తం దీని చుట్టూనే తిరిగింది. గతంలో టీడీపీ ఆఫీస్ పై దాడి జరిగినప్పుడు కూడా ఈ స్థాయిలో స్పందన లేదు, ఆఖరికి చంద్రబాబు ఏడుపు కూడా కార్యకర్తలను కదిలించలేకపోయింది. పోనీ కరోనా టైమ్ జనం ఎవరూ బయటకు రావట్లేదు అనుకుంటే.. ఇదిగో ఇప్పుడు టీచర్లు, ఉద్యోగులు తామంటే ఏంటో నిరూపించారు. పోలీసు ఆంక్షలున్నాయని తెలిసినా, కరోనా అంటుకునే ప్రమాదం ఉందనే భయం ఉన్నా కూడా రోడ్లపైకి వచ్చారు. తాము అనుకున్నది కాస్తో కూస్తో సాధించగలిగారు. రిజల్ట్ సంగతి పక్కనపెడితే ఆ ప్రయత్నం అభినందించదగ్గది.

అలాంటి ప్రయత్నం కనీసం ప్రతిపక్షాలు చేయలేకపోవడమే వారి అసమర్థతకు నిదర్శనం. రోడ్లపైకి వస్తే, జెన్యూన్ గా జనం వస్తే అలాంటి కార్యక్రమాలకు ఏ స్థాయిలో స్పందన వస్తుందనేది 'ఛలో విజయవాడ'తో తేలిపోయింది. అందుకే కష్టమో, నష్టమో ఇకపై అన్నీ రోడ్లపైనే అంటున్నారు టీడీపీ నేతలు. 

మరి ఈ ప్రయోగం వర్కవుట్ అవుతుందా, టీడీపీ వాళ్లు రోడ్లపైకి వచ్చి జగన్ కి వ్యతిరేకంగా జనాల్ని పోగేయాలనుకోవడం కుదురుతుందా, జనం సమర్థిస్తారా, తిరగబడతారా.. అనేది ముందు ముందు తేలిపోతుంది. అన్నింటికి మించి ఈ విషయంలో టీడీపీ ఎత్తుకునే అంశాలపై ప్రతిపక్షాల మద్దతు ఆధారపడి ఉంటుంది.