మొత్తానికి బీసీ మంత్రి గారు వెళ్ళి వెళ్ళి టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ఇలాకాలో బాగానే హడావుడి చేశారనుకోవాలి. బీసీలను వైసీపీ సర్కార్ ఆదుకుంటోంది అని కూడా అక్కడ ఆయన చెప్పుకొచ్చారు. బీసీల కోసం 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసిన చరిత్ర, రికార్డు అచ్చంగా జగన్ దే అన్నారు.
అంతే మాజీ మంత్రి అయ్యన్న దీని మీద ఒక్క లెక్కన ఫైర్ అవుతున్నారు. బీసీలకు మేలు చేసిన పెద్ద బీసీ ఎవరైనా ఉంటే అది చంద్రబాబు కాదూ అంటూ అయ్యన్న బిగ్ సౌండ్ చేశారు. బీసీలకు ఎవరు మేలు చేశారో తేల్చుకుందామా అంటూ మంత్రి వేణుగోపాలక్రిష్ణకు చాలెంజి కూడా చేశారు.
బీసీలు అంటేనే టీడీపీ అంటూ అయ్యన్న మాట్లాడారు, బీసీలకు రాజకీయాల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చింది ఎన్టీయార్ అన్నారు అయ్యన్న. నిజమే అది అన్న గారి జమానా, మరి చంద్రన్న జమానాలో బీసీలకు అసలైన అధికారాలు దక్కాయా అన్నదే వైసీపీ నేతల మాట.
ఇవన్నీ పక్కన పెడితే అయ్యన్న బాబునే పెద్ద బీసీ అంటున్నారు. మరి జగన్ బీసీలకు ఏమీ చేయలేదని కూడా అనేస్తున్నారు. బీసీ మంత్రి వేణుగోపాల క్రిష్ణతో బహిరంగ చర్చ అంటున్నారు. మొత్తానికి మంత్రి గారు నర్శీపట్నం టూర్ లో బీసీలకు వైసీపీ మేలు చేసింది అని చెప్పడంతోతోనే అయ్యన్నకు మండుకొచ్చిందా అన్నదే డౌట్.
అయ్యన్న సవాల్ బాగానే ఉంది.దానికి జవాబు ప్రజలు 2019 ఎన్నికల తీర్పు ద్వారా ఇచ్చారు కాబట్టి మేమేందుకు అని వైసీపీ నేతలు అనడమూ బహు బాగుంది. ఏది ఏమైనా చాలా రోజుల తరువాత అయ్యన్న మళ్లీ మీడియా ముందుకు వచ్చి సౌండ్ చేస్తున్నారు అంటే అంతా బీసీ మంత్రి గారి మహిమే అంటున్నారు.