తాను వెళితే.. మజ్జిగకు గతిలేదు గానీ.. పెరుగుకి చీటీ రాసి పంపించాడట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్న తీరు అంతకంటె భిన్నంగా ఏమీ లేదు. పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతున్న తరుణంలో.. పార్టీ ఎంపీలను కూర్చోబెట్టుకుని పార్లమెంటులో ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో.. ఎవరిమీద నిందలు వేయాలో.. ఆయన మార్గదర్శనం చేస్తున్న తీరు చూస్తే.. ఇంతకంటె అసమర్థపు మార్గదర్శి మరొకరు ఉండరని కూడా అనిపిస్తుంది.
చంద్రబాబునాయుడును ప్రజలు ఒక నమ్మకంతో గెలిపించారు. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే మేలు జరుగుతుందని ప్రజలు అనుకున్నారు. ఆ హోదాను ఇచ్చారు. ప్రధాన ప్రతిపక్షనేత హోదాను, కేబినెట్ సమానమైన ర్యాంకులో ఆయన సదుపాయాలు పొందుతున్నారు. రాష్ట్ర ప్రజలు నిర్దేశించిన ప్రకారం.. అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తమ నిర్ణయాలలో ఏమైనా తప్పులు చేస్తూ ఉంటే ఆయన ఎత్తిచూపించాలి. వారిని అలర్ట్ చేయాలి. ఆ రకంగా రాష్ట్రానికి నష్టం జరగకుండా చూడాలి. అదీ ప్రజలు నిర్దేశించిన ఆయన పాత్ర.
కానీ చంద్రబాబునాయుడు అసెంబ్లీనుంచి పలాయనం చిత్తగించారు. నా భార్యను అన్నారు.. నన్ను అన్నారు .. అంటూ మొసలి కన్నీరు కార్చి పారిపోయారు. ఆయన ప్రజల తీర్పుకు ఏం గౌరవం ఇచ్చినట్టు? చట్టసభకు ఏం మర్యాద ఇచ్చినట్టు? ప్రజాస్వామిక స్ఫూర్తిని ఏం కాపాడినట్టు? నా ఇంట్లో వాళ్లని అంటే నేను వెళ్లను, నాకు నొప్పి కలిగితే వెళ్లను అని అనుకునేట్లయితే ఆయన ఇంట్లోనే కూర్చోవచ్చు కదా.. అసలు రాజకీయాల్లోకి రావడం ఎందుకు? అనేది ప్రజల సందేహం.
తన విషయంలో శాసనసభకు వెళ్లే తెగువ లేదు గానీ.. తన పార్టీ నుంచి ఉన్న పిడికెడు ఎంపీలు పార్లమెంటులో ఏం పోరాటం చేయాలో ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. అందుకే ఈ వ్యవహారం పెద్ద కామెడీగా కనిపిస్తోంది. పైగా ఆయన చెబుతున్నవేమీ కొత్త సంగతులు కూడా కాదు. ప్రత్యేకహోదా లాంటి.. తానే పాతిపెట్టేసిన అంశాలను కూడా ఇప్పుడు చెబుతున్నారు. ఇంతకంటె పెద్ద నాటకం ఏముంటుంది.?
ప్రధానంగా జగన్ ప్రభుత్వం తన ఏడుపునంతా ఎంపీలు పార్లమెంటులో వినిపించాలని చంద్రబాబు కోరిక. జగన్ ఇంధన ధరలు పెంచేశారని, రైతు వ్యతిరేక పోకడలు అనుసరిస్తున్నారని ఎంపీలు వెళ్లి పార్లమెంటులో చెప్పాలట. జగన్ తప్పు చేస్తూ ఉంటే గనుక.. ఆ తప్పును ఇక్కడ అసెంబ్లీలో చెప్పడానికి వగలేదుగానీ.. ఎంపీలు వెళ్లి అక్కడ చెప్పాలనడం కామెడీ కాక మరేమిటి.
చంద్రబాబు భార్యను ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నారని అనుకున్నా.. ఆ నొప్పి ఆయనకు ఉండాలి. తతిమ్మా తెదేపా ఎమ్మెల్యేలందరికీ అంత నొప్పి ఎందుకు? వారైనా ప్రజా సమస్యల్ని ఇక్కడ అసెంబ్లీలో ప్రస్తావించాలి కదా. ఇక్కడ చేయాల్సింది చేయకుండా.. ఢిల్లీలో పోరాడాలని చంద్రబాబు చెప్పడాన్ని చూస్తోంటే.. మార్గదర్శనం చేయడంలో ఆయనను మించిన అసమర్థుడు లేడని అందరూ నవ్వుకుంటున్నారు.