కొన్ని క్యారెక్టర్లను మన చుట్టుపక్కలున్న వ్యక్తులతో పోల్చుకుంటుంటాం. ఇంత వరకూ ఎవరైనా దగ్గరి వాళ్లకు వెన్నుపోటు పొడవడమో, రోజుకో మాట మార్చడమో, నిలకడలేని స్నేహాలు చేయడమో, తిట్టిన వాళ్లనే అవసరాల కోసం ఆలింగనం చేసుకోవడం లాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులను చంద్రబాబుతో పోల్చుకోవడం తెలిసిందే. అలాంటి వాళ్లను వ్యంగ్యంగా పల్లెల్లోనైతే చంద్రబాబు అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లో కోకొల్లలు.
ఇప్పుడు గ్లోబలైజేషన్ యుగం. ప్రపంచ వ్యాప్తంగా ఏం జరుగుతున్నదనే పరిశీలన పెరిగింది. దీనికి సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడం కూడా ఒక కారణం. అంతెందుకు నిన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్, ఆయన ప్రధాన ప్రత్యర్థి బైడెన్ తమ అనుచరులనుద్దేశించి మాట్లాడ్డాన్ని లైవ్‌లో ప్రపంచమంతా ఆసక్తిగా వీక్షించింది.
ట్రంప్ పట్ల ఆ దేశ ప్రజల అభిప్రాయాలు, ఆదరాభిమానాలు ఎలా ఉన్నా …. ప్రపంచం మాత్రం ఆయన్ని ఓ అబద్ధాలకోరుగానే చూస్తోంది. అలాగే ప్రపంచ పెద్దన్నగా అజమాయిషీ చెలాయించే దేశాధ్యక్షుడిగా పెద్దరికం లేకుండా వ్యవహరిస్తారనే ఆరోపణలు ఆయనపై వెల్లువెత్తాయి. అయినా తన నైజాన్ని ఏ మాత్రం మార్చుకోని వ్యక్తిత్వం ట్రంప్ సొంతం.
ఎందుకోగాని మన చంద్రబాబులో చాలా మందికి ట్రంప్ కనిపిస్తుంటారు. అచ్చం ట్రంప్‌లాగే తన రాజకీయ అనుభవం , వయస్సుకు తగ్గట్టు చంద్రబాబు వ్యవహరించడం లేదనే ఆరోపణలు కొన్నేళ్లుగా తెలుగు సమాజంలో వేళ్లూనుకున్నాయి.
2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబంతా డర్టీయిస్ట్ పొలిటీషియన్ లేరని కేసీఆర్ అన్న మాటలు జనంలోకి బాగా దూసుకెళ్లాయి. అనేక సందర్భాల్లో చంద్రబాబు తన స్థాయి మరిచి నేలబారు రాజకీయాలు చేసిన ఘటనలు అనేకం.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయమై చంద్రబాబు మరోసారి తన నైజాన్ని చాటుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకైతే కరోనా ఉంది గానీ , బడులు తెరవడానికి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోడానికి లేదా? అని చంద్రబాబు ప్రశ్నించారు.
కరోనాను కూడా తమ స్వార్థానికి వాడుకుంటున్న చరిత్ర వైసీపీకే దక్కుతుందని ఆయన ధ్వజమెత్తారు. అనకాపల్లి లోక్‌సభ నియోజక వర్గ నేతలతో సమీక్ష సందర్భంగా చంద్రబాబు ఈ ఆరోపణలు చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల విషయమై మాట్లాడే అర్హతే చంద్రబాబుకు లేదనేది రాష్ట్ర ప్రజలతో పాటు ప్రత్యర్థి పార్టీల అభిప్రాయం. ఎందుకంటే తన హయాంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా, అప్పట్లో ఆ ఊసే ఎత్తలేదు.
ఆంధ్రప్రదేశ్‌లో 2018 ఆగస్టు 1 నాటికే (రెండేళ్ల మూడు నెలల క్రితమే) గ్రామ పంచాయతీలు, జూలై 5వ తేదీ (ఏడాది నాలుగు నెలల కిత్రమే) నాటికే మండల, జిల్లా పరిషత్‌లు, మున్సిపల్ కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసిపోయింది. అప్పుడు అధికారంలో చంద్రబాబు ఉన్నారు.
అంతేకాదు, ఇప్పట్లా కరోనా మహమ్మారి ఏమీ లేదు. మరెందుకని ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చిందో చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డ సమాధానం చెప్పాలని పదేపదే అధికార వైసీపీ ప్రశ్నిస్తోంది.
మరో ఏడాదిలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో, ప్రజా వ్యతిరేకతను పసిగట్టిన చంద్రబాబు… ఒకవేళ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే అసలుకే ఎసరు వస్తుందనే భయాందోళనతో వాటి జోలికే వెళ్లలేదు. ఇప్పుడు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల విషయమై ఆయన కూడా ధర్మోపన్యాసాలు చేస్తున్నారు.
కరోనాను స్వార్థ ప్రయోజనాలకు జగన్ సర్కార్ వాడుకోవడం కాదు … వ్యవస్థలను తన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఎలా వాడుకున్నారో జనం గ్రహించారు.
అమెరికాలో విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఒకవైపు తన పార్టీ వాళ్లకు ట్రంప్ పిలుపునిస్తూనే, మరోవైపు సుప్రీంకోర్టుకు వెళ్తానని ప్రకటించడాన్ని చూశాం. ట్రంప్‌ను చూస్తే చంద్రబాబు గుర్తుకు రాకపోతే ఆశ్చర్యపోవాలే తప్ప …వస్తే ఎందుకనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న