మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. అయితే చంద్రబాబు మాత్రం సురక్షితం. మూడు రోజుల క్రితం చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి ఉండవల్లికి వచ్చారు. వేర్వేరు కేసుల్లో జైలు నుంచి విడుదలైన మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలను ఆయన పరామర్శించారు.
ఇక ఏపీలో చేసేదేమీ లేకపోవడంతో తిరిగి ఆయన హైదరాబాద్‌కు శనివారం పయనమయ్యారు. తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద బాబు వెళుతున్న కాన్వాయ్‌కి ఆవు అడ్డొచ్చింది. దీంతో ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ బ్రేక్ వేశాడు. ఈ నేపథ్యంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఒక్కసారిగా కాన్వాయ్‌లో ముందున్న ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ఘటనలో వాహనం ముందు భాగం దెబ్బతింది. వాహనంలోని సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి వెనుక వాహనంలో ఉన్న బాబు మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. కాసేపు చంద్రబాబు రోడ్డు మీద నిల్చోవాల్సి వచ్చింది. అనంతరం యధావిధిగా కాన్వాయ్ హైదరాబాద్‌కు పయనమైంది. తమ నాయకుడికి ప్రమాదం తప్పడంతో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.