ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీవ్ర విమర్శల నేపథ్యంలో వైసీపీ ప్రజాప్రతినిధులు ఎదురు దాడికి దిగారు. వైసీపీ ఫైర్‌బ్రాండ్, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో చంద్రబాబుపై ఓ రేంజ్లో నిప్పులు చెరిగారు. వరద బాధితుల దగ్గరికెళ్లి సాయం చేయడానికి బదులు… తన భార్యకేదో జరిగిందని దొంగ ఏడ్పులు ఏడుస్తున్నారని ధ్వజమెత్తారు.
వరద బాధితుల దగ్గరికెళ్లి ఏరియర్ సర్వే చేస్తే ఏమొస్తుందని చంద్రబాబు ప్రశ్నించడం దుర్మార్గమన్నారు. గతంలో తాను ఏ విధంగా ఏరియల్ సర్వే చేశారో అందరికీ తెలుసన్నారు. తమ ప్రభుత్వం వరద బాధితులను అన్ని రకాలుగా ఆదుకుంటోందన్నారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు.
చంద్రబాబు చెప్పేదల్లా నమ్మే కాలం పోయిందన్నారు. బాబు శాడిజనికి పరాకాష్టగా జగన్‌పై విమర్శలున్నాయన్నారు. జగన్ గాలిలో తిరుగుతున్నాడని, గాలిలోనే పోతాడని ఆయన మాట్లాడ్డం అత్యంత విచారకరమన్నారు. జగన్ ఉన్నంత వరకూ బాబు ముఖ్యమంత్రి, లోకేశ్ ఎమ్మెల్యే కాలేరని రోజా జోస్యం చెప్పారు.
జగన్‌పై అవాకులు చెవాకులు పేలితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఆయన్ను రాజకీయంగా లేకుండా చేయాలనుకునే వాళ్లు… సోనియాగాంధీ, శంకర్రావు లాంటి వాళ్లు ఏమయ్యారో తెలుసుకోవాలని హితవు పలికారు. కుప్పంలో టీడీపీ ఓటమి తర్వాత చంద్రబాబుకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తోందని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రకృతి పరంగా వచ్చిన భారీ వర్షాలు మానవ తప్పిదం ఎలా అవుతుందని ప్రశ్నించారు.
గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టన బెట్టుకోవడం మానవ తప్పిదం అవుతుందన్నారు. దీనికి బాధ్యుడైన చంద్రబాబుపై ఏ కేసులు పెట్టాలో చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు బయటకు రాకుండా సీసీ ఫుటేజ్ డిలీట్ చేయించారని ఎమ్మెల్యే రోజా దుయ్యబట్టారు. చంద్రబాబు వరద బాధితుల దగ్గర బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో ఎవరికైనా కోటి రూపాయలు పరిహారం ఇచ్చారా..? అని రోజా ప్రశ్నించారు.