నాడు చర్చిలో పాస్టర్ లా మాట్లాడారు.. ఇప్పుడేమో క్రైస్తవాన్నే తీవ్రంగా నిరసిస్తున్నారు తెలుగుదేశం అధినేత. అప్పుడు పాస్టర్ లా మాట్లాడినా, ఇప్పుడు పెద్ద పూజారిలా మాట్లాడుతున్నా.. అది చంద్రబాబు నాయుడి ఓట్ల లెక్కల మేరకే తప్ప, ఆయనకంటూ ఒక వ్యక్తిత్వం ఉందని ఎవ్వరూ అనుకోవడం లేదు.
కులానికీ, మతానికి వరాలను ప్రకటిస్తూ మెనిఫెస్టోని ప్రకటించిన చంద్రబాబు నాయుడు తన ఎన్నికల హామీల్లో క్రిస్టియన్ల కోసమే ప్రత్యేకంగా బోలెడన్ని హామీలను ఇచ్చారు. తమకు అధికారం ఇస్తే.. జెరుసలేం యాత్రలకు రాయితీలు ప్రకటించారు చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం హయాంలో జెరుసలేం యాత్రలకు రాయితీలు కొనసాగాయి. అంతే కాదు..అనేక మార్లు చంద్రబాబు నాయుడు చర్చికి వెళ్లి పూజలు చేశారు!
అంతేనా బైబిల్ లో 23వ సూక్తం చదివి వినిపించిన పాస్టర్ చంద్రబాబు నాయుడే. అంతకు ముందు ఓట్ల కోసం క్రిస్మస్ తాత వేషం వేసింది కూడా చంద్రబాబు నాయుడే! అయితే అప్పుడు క్రైస్తవుల ఓట్లు జగన్ కు మాత్రమే పడిపోతాయేమో అనే భయం. అందుకే .. అప్పుడు చర్చికి వెళ్లారు, బైబిల్ చదివారు. పవిత్రమైన ప్రభువా.. అని ప్రార్థించారు!
ఆ వీడియోలు ఎక్కడికీ పోలేదు. ఇప్పుడు ఏపీలో బలవంతపు మతమార్పిడిలు జరుగుతున్నాయని, క్రిస్టియన్లే ఆ పని చేస్తున్నారని, ముఖ్యమంత్రే మత మార్పిడిలు చేయిస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు బహిరంగ ఆరోపణలు చేస్తూ ఉన్నారు.
ఇప్పుడు చంద్రబాబు లెక్క.. క్రిస్టియన్ ఓట్లు అవసరం లేదు, క్రిస్టియన్ల మీద దుమ్మెత్తి పోస్తూ .. హిందువుల ఓట్లను గంపగుత్తగా సొంతం చేసుకోవాలనే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.
అయితే చంద్రబాబు నాయుడి తీరు కొత్త బిచ్చగాడి వలె ఉంది. ఇది వరకూ ఈయన ఏ స్థాయి హిందుత్వవాదాన్ని అనుసరించారో వేరే చెప్పనక్కర్లేదు. అయ్యప్ప మాల దగ్గర నుంచి అనేక హిందూ ఆచారాలను కించపరుస్తూ మాట్లాడింది ఇదే చంద్రబాబు నాయుడే.
అంతే కాదు.. పాపాలు చేసిన వాళ్లే గుళ్లకు వెళ్లి హుండీల్లో డబ్బులేస్తున్నారని వ్యాఖ్యానించింది కూడా చంద్రబాబు నాయుడే. అయితే.. ఇప్పుడు రామప్పంతుల్లా మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో ముస్లింలను మాత్రం చంద్రబాబు నాయుడు మచ్చిక చేసుకునే మాటలు మాట్లాడుతున్నారు.