ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని మీడియా కోడై కూస్తూ ఉంటే, తమ పార్టీ నేతను కిడ్నాప్ చేశారని అంటున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు! శుక్రవారం ఉదయం అచ్చెన్నాయుడి ఇంటి మీద పడి వంద మంది పోలీసులు ఆయనను కిడ్నాప్ చేశారని అంటున్నారు చంద్రబాబు నాయుడు! అంతే కాదట.. ఇందుకు బాధ్యత వహిస్తూ ఏపీ హోం శాఖా మంత్రి రాజీనామా చేయాలని కూడా చంద్రబాబు నాయుడి డిమాండ్ చేసేశారు!
చంద్రబాబు నాయుడి డిమాండ్లన్నీ ఇలా చోద్యంగానే ఉంటాయి మరి. లేకపోతే అచ్చెన్నాయుడి అరెస్టుకు బాధ్యతగా హోం శాఖా మంత్రి రాజీనామా చేయాలని అనడం ఏమిటో! అంతా అరెస్టు అంటుంటే చంద్రబాబు నాయుడు మాత్రం కిడ్నాప్ చేశారని అంటున్నారు. అంతే కాదట.. అప్పుడే అచ్చెన్నాయుడి విషయంలో బోలెడంత సానుభూతి వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. అచ్చెన్నకు ఫోన్ చేసుకునే అవకాశం ఇవ్వలేదని, అచ్చెన్నకు మందులు వేసుకునే అవకాశం ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు ఆవేదన . వ్యక్తం చేశారు.
ఇంతకీ అచ్చెన్నాయుడు ఎక్కడ ఉన్నారో డీజీపీ చెప్పాలట. తాము ఫోన్ చేసినా అచ్చెన్న అందుబాటులోకి రావడం లేదట. మొత్తానికి తన పార్టీ నేత అరెస్టు అయితే.. దాన్ని కిడ్నాప్ అంటూ చంద్రబాబు కామెడీ చేస్తున్నట్టుగా ఉన్నారు!