మొన్నటి వరకూనేమో రుణమాఫీని జగన్ మోహన్ రెడ్డి చేయాలని అన్నారు. తాము ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించి, ఐదు విడతల్లో మూడు విడతల మాఫీని చేసీ చేయనట్టుగా అనిపించి, ఇప్పుడు ఆ పని జగన్ ఎందుకు చేయడంలేదని తెలుగుదేశం పార్టీ ఒక వితాండవాదం చేసింది.
తమ చేతగాని తనాన్ని కూడా అలా జగన్ మీద విమర్శలకు ఉపయోగించుకున్న మేధస్సు తెలుగుదేశం పార్టీ. అదలా ఉంటే.. ఇప్పుడు మరో అంశాన్ని లాగారు. అది కూడా చంద్రబాబు నాయుడు పెట్టిన చిచ్చే!
కాపు రిజర్వేషన్ల అంశం. తాము కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లను చేసినట్టుగా.. వాటిని అమలు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని చంద్రబాబు నాయుడు ప్రశ్నించేశారు!
చంద్రబాబు నాయుడు కాపులకు రిజర్వేషన్ల అంశం గురించి ఎప్పుడు ఎలా వ్యవహరించారో అందరికీ తెలిసిందే! ఆ వైఖరితోనే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు కూడా! అయితే తాము కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లను కల్పించినట్టుగా చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. కేంద్రం ఈబీసీ కేటగిరికి ఇచ్చిన పదిశాతం రిజర్వేషన్లలో ఐదుశాతం కాపులకు అని చంద్రబాబు నాయుడు అప్పట్లో ఒక నోటిమాట చెప్పారు కదా, దాన్ని అమలు చేయడం గురించి చంద్రబాబు ప్రశ్నించారు.
అయినా కేంద్రం రిజర్వేషన్లు ఇచ్చింది ఈబీసీలకు. దాని అమలే ఇంకా కొశ్చన్ మార్క్ గా ఉంది. అవేవీ అమల్లోకి వచ్చేయలేదు. గాలికిపోయే పిండి కృష్ణార్పణం అన్నట్టుగా దాన్ని చంద్రబాబు నాయుడు తన రాజకీయానికి అనుగుణంగా వాడుకున్నారు. ఈబీసీ రిజర్వేషన్లలో ఐదుశాతం కాపులకు అని ఒక గాలి మాట చెప్పారు. అదెలా చెల్లుతుందో ఆయనకే తెలియాలి.
ఇప్పుడు దాని గురించి చంద్రబాబు నాయుడు జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించేశారు. మొత్తానికి తను రిజర్వేషన్ల పేరుతో కాపులను వంచించి, వారి చేత తిరస్కరణ పొందాకా కూడా చంద్రబాబు నాయుడు మళ్లీ అదే అంశాన్ని వాడుకుని రాజకీయం చేస్తూ ఉండటం మాత్రం ఆయన తీరును తెలియజేస్తోందని పరిశీలకులు అంటున్నారు.