తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన చేతగాని తనాన్ని మరోసారి తనే హైలెట్ చేసుకొంటూ ఉన్నారు. తనకు అధికారం ఇస్తే రుణమాఫీ చేస్తానంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 ఎన్నికల ముందు ఆ హామీని ఇచ్చే చంద్రబాబు నాయుడు అధికారాన్ని పొందారు. రైతు రుణమాఫీ సాధ్యం అయ్యే పని కాదు అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పినా చంద్రబాబు నాయుడు తనకు అధికారం ఇస్తే చేసి చూపిస్తానంటూ మాట్లాడారు.
ప్రజలు ఆ హామీని నమ్మారు. రుణమాఫీఅనగానే అనంతపురం వంటి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి అప్పుడు రైతులు ఎగబడి ఓట్లేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో రైతులకే బాగా తెలుసు. అధికారంలోకి రాగానే శాశ్వత రుణవిముక్తి అంటూ ప్రకటించిన చంద్రబాబు నాయుడు నానా షరతులు పెట్టారు. తాకట్టులోని బంగారం కూడా విడిపిస్తామంటూ చెప్పి.. ఆ తర్వాత హ్యాండివ్వడం మొదలుపెట్టారు.
విడతల వారీగా మాఫీ అని ప్రకటించారు. అనేక మంది రైతులను రుణమాఫీకి అనర్హులు అని ప్రకటించారు. అదేమంటే వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంటూ చంద్రబాబు నాయుడు స్వయంగా వ్యాఖ్యానించారు. ఇక మాఫీకి అర్హులు అంటూ తేల్చిన వారికి కూడా ఐదు విడతల్లో మాఫీ అన్నారు. మరి అలాగైనా ఐదేళ్ల పాలనలో ఐదు విడతల మాఫీ చేయాలి కదా.. చేసింది మూడు విడతలే అని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు.
ఆ ఐదేళ్లూనేమో రుణమాఫీ జరిగిపోయిందని ప్రకటించి.. ఇప్పుడు మాత్రం మూడు విడతల మాఫీనే జరిగిందంటూ తెలుగుదేశం పార్టీ వాళ్లు నిస్సిగ్గుగా ప్రకటించుకుంటున్నారు. ఈ నిస్సిగ్గు తనంలో మరో చాప్టర్ .. మిగిలిన రెండు విడతల మాఫీని జగన్ చేయాలంటూ టీడీపీ పదే పదే వ్యాఖ్యానిస్తూ ఉండటం. తాజాగా చంద్రబాబు నాయుడు మరోసారి ఆదే డిమాండ్ చేశారు. మిగిలిన రెండు విడతల మాఫీ సొమ్ములనూ ప్రభుత్వం విడుదల చేసేయాలని చంద్రబాబు డిమాండ్ చేసేశారు!
ఐదేళ్లు.. ఐదు విడతలు అని ప్రకటించుకుని..ఇప్పుడు తమ చేతగాని తనాన్ని తామే హైలెట్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు రుణమాఫీ అంటూ జగన్ మెడ మీద కత్తి పెట్టాలని చూస్తున్నారు. ఇలాంటి కామెడీలు చేసే జనాలు తెలుగుదేశం పార్టీని చిత్తుగా ఓడించారు. అయినా ఆ పార్టీ తీరులోనూ, ఆ పార్టీ అధినేత తీరులోనూ ఏ మాత్రం మార్పు రాకపోవడాన్ని చూసి మాత్రం జనాలు కూడా నవ్వుకుంటున్నారు!