ఆయన ఏదో బాధిత, పీడత పక్షం వహించినట్టుగా.. మాట్లాడుతూ ఉన్నారు. జనసేన అధిపతి పవన్ కల్యాణ్ ఇప్పటికే ఈ విషయంలో తెగ రియాక్ట్ అయిపోయారు. తమ పార్టీ ఎమ్మెల్యే ఎర్నెస్ట్ చేగువేరా అన్నట్టుగా మాట్లాడాడు పవన్ కల్యాణ్. ఇంతజేసీ ఆయన తెగించింది పేకాట పాపారావుల కోసం. పేకాట ఆడి పోలిసులకు దొరికిన తన అనుచరులను విడిపించుకోవడానికి ఆయన పోలీస్ స్టేషన్ మీద దాడికి దిగారు. దీంతో కేసులు నమోదయ్యాయి. కొన్ని నిమిషాల పాటు అరెస్టు అయ్యి, వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేశారాయన.
అయితే ఈ విషయంలో పవన్ కల్యాణే కాదు, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కూడా రియాక్ట్ అయిపోయారు. జనసేన ఎమ్మెల్యేను అరెస్టు చేయడం అన్యాయమని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యల్లో భాగంగానే రాపాక వరప్రసాద్ ను అరెస్టు చేసిందంటూ చంద్రబాబు నాయుడు అన్నారు. ఇలా జనసేన ఎమ్మెల్యే తరఫున చంద్రబాబు నాయుడు వకాల్తా పుచ్చుకుని మాట్లాడారు.
ఆఖరికి పేకాట వ్యవహారాన్ని ఇంతలా వాడుకోవాలని చూస్తున్న వీరి తపనను జనాలు గమనిస్తూనే ఉంటారు. మాటెత్తితే కక్షసాధింపు చర్యలు, ఆ ఎమ్మెల్యేను చేర్చుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నాయని అంటున్నారు. ఆశా కార్యకర్తల విషయంలో ఫేక్ ట్వీట్ పెట్టి అడ్డంగా దొరికిపోయారు ఇప్పటికే చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు పేకాట ఎమ్మెల్యేను కూడా ఏదో స్వతంత్ర సమరయోధుడులా చిత్రీకరిస్తున్న తీరు కూడా అలానే ఉంది. పేకాటరాయుళ్ల కోసం స్టేషన్ మీదకు రాళ్లేసి.. అందులో కూడా రాజకీయ ప్రయోజనాలను వెదుక్కోవాలని పవన్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ అందుకోసం పోటీపడుతూ ప్రహసనం పాలవుతూ ఉన్నారని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.