కట్టడం చేతగాని వాళ్లకు కూల్చే హక్కులేదు.. ఇదీ చంద్రబాబు ట్విట్టర్ సందేశం. కరకట్టపై తన ప్రజావేదిక కూల్చివేత నుంచి మొదలు.. నిన్నటి గీతం యూనివర్సిటీ ప్రహరీ గోడ కూల్చివేత వరకు చంద్రబాబు ఇదే డైలాగ్ చెబుతున్నారు. పోనీ అవన్నీ అక్రమ నిర్మాణాలు అనే విషయం చంద్రబాబుకి తెలియదా అంటే తెలియక కాదు.
సబ్బంహరి సులభ్ కాంప్లెక్స్ అయినా, గీతం ప్రహరీ గోడలైనా.. అన్నీ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి కట్టుకున్నవే. ప్రజావేదిక అయితే ఏకంగా కృష్ణమ్మని కబ్జా చేసి కట్టింది. అందుకే వాటికి మూడింది.
ఇక నిర్మాత, దర్శకత్వం.. ఈ విషయాలకి వద్దాం. చంద్రబాబు ఐదేళ్ల అధికారంలో రాష్ట్రంలో కొత్తగా ఏమేం నిర్మించారయ్యా అంటే.. తాత్కాలిక భవనాలే గుర్తుకొస్తాయి. చిన్న వర్షానికే చినుకులు పడే సచివాలయం, ఓ మాదిరి వర్షాలకు కొట్టుకుపోయే రోడ్లున్న అమరావతి.. చిన్న గాలికే ఎగిరే సచివాలయం పైకప్పులు.. ఇవే కదా చంద్రబాబు నిర్మించినవి.
ఐదేళ్ల పాటు పోలవరం గురించి పేపర్లలో ఊదరగొట్టి చేసిందేంటి అంటే.. కాఫర్ డ్యామ్ నిర్మాణం అట. పూర్తి డ్యామ్ లో 10వ వంతు పని ఉన్న కాఫర్ డ్యామ్ ని ఐదేళ్ల పాటు కష్టపడి నిర్మించారు మన పొలిటికల్ జక్కన్న. ఇక శిలాఫలకాలు, శంకుస్థాపనలు అంటారా.. వాటిలో బాబుది ప్రపంచ రికార్డ్. మేం శంకుస్థాపనలు చేశాం, మీరు పూర్తి చేయండి అంటూ ఇప్పుడు జగన్ వెంట పడుతున్నారు.. సిగ్గులేకుండా.
ఇక జగన్ నిర్మాణాల విషయానికొద్దాం. శంకుస్థాపనలో బాబుది ప్రపంచ రికార్డ్ అయితే.. నిర్మాణాల్లో కచ్చితంగా జగన్ ది ప్రపంచ రికార్డ్ అవుతుంది. చంద్రబాబు ఒక సచివాలయం కట్టారు, అది కూడా తాత్కాలికం. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే ఊరూరా సచివాలయాల నిర్మాణాలు మొదలయ్యాయి.
ఏడాదిన్నరలోగా దాదాపుగా సగం పని పూర్తయింది. ఏపీలో మొత్తం రెవెన్యూ గ్రామాలు 17,398 ఉన్నాయి. 25 నగర పంచాయతీలు, 71 మున్సిపాల్టీలు వీటికి అదనం. ప్రతి గ్రామంలో సచివాలయం, ప్రతి వార్డుకీ సచివాలయం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20వేల నూతన సచివాలయాలు నిర్మాణమవుతున్నాయి.
వీటికి అనుబంధంగా దాదాపు 10వేల రైతు భరోసా కేంద్రాలు. త్వరలో వీటి పక్కనే ప్రథమ చికిత్సా కేంద్రాలు, స్థానిక ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఇవన్నీ గ్రామ పంచాయతీల ఆస్తులు. రాజధానిలో ఎన్ని సచివాలయాలు కడితే వీటికి సమానం అవుతుంది. కేంద్రం సహకరిస్తే.. మరో రెండేళ్లలో పోలవరం పూర్తి చేస్తామంటున్నారు జగన్.
ఇప్పుడు చెప్పండి నవ్యాంధ్ర నిర్మాత.. జగనా, చంద్రబాబా..? కట్టడం చేతగాని వాళ్లకు కూల్చే హక్కులేదంటున్న చంద్రబాబు ఇప్పుడేమని సమాధానం చెబుతారు.
గ్రామాల్లో ప్రజల కోసం సచివాలయాలు కడుతూ.. మరోవైపు ఆక్రమణల అంతు తేలుస్తున్నారు జగన్. ఇక్కడ నిలబెడుతున్నారు, అక్కడ పడగొడుతున్నారు. అలా బ్యాలెన్స్ చేస్తున్నారు. చంద్రబాబుకి కట్టడం, కూలగొట్టడం రెండూ చేతకాదు. అందుకే ఆయన్ని రాష్ట్ర ప్రజలు తొందరగానే వదిలించుకున్నారు.