కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చితికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన మార్క్ పరిష్కారం చూపారు. మాజీ మంత్రి, టీడీపీ నేత పి.రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరికను ఆ నియోజక వర్గ ఎమ్మెల్యే ఎం.సుధీర్‌రెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. అయినప్పటికీ రామసుబ్బారెడ్డికి ఉన్న మంచిపేరు, టీడీపీని ఖాళీ చేయాలన్న ఆలోచనతో ఆయన్ను పార్టీలోకి చేర్చుకున్నారు.
కానీ ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవన్న చందంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కలిసి పని చేయకపోగా, అవే వర్గ విభేదాలను కొనసాగిస్తుండడం వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా తయారైంది. ఈ నేపథ్యంలో సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చి జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ పెద్దలు రంగంలోకి దిగారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిని విజయవాడకు పిలిపించుకుని సీఎం జగన్‌తో కూచోపెట్టారు. ఈ చర్చల్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. జమ్మలమడుగు వైసీపీలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల గురించి సీఎంకు రామసుబ్బారెడ్డి వివరించారు. ఈ సందర్భంగా పరిష్కార మార్గంగా రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేలా సీఎం అంగీకరించారు. అంతేకాదు, జిల్లాలో రాజకీయంగా తగిన ప్రాధాన్యత కూడా ఇస్తానని సీఎం హామీ ఇచ్చారు.
ఇదే సందర్భంలో 2024 ఎన్నికల్లో కూడా డాక్టర్ సుధీర్‌రెడ్డికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనున్నట్టు సీఎం తేల్చి చెప్పారు. ఒక వేళ నియోజక వర్గాల పునర్విభజన జరిగితే రామసుబ్బారెడ్డికి కూడా టికెట్ ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సజ్జల తెలిపారు. వచ్చే ఎన్నికల్లో సుధీర్‌కు తన మద్దతు ఉంటుందని రామసుబ్బారెడ్డి తెలిపారు. అలాగే తన వెంట పార్టీలోకి వచ్చిన వారికి గౌరవం, గుర్తింపు ఇవ్వాలని సీఎంను కోరినట్టు రామసుబ్బారెడ్డి తెలిపారు.
ఇదిలా ఉండగా ఇకపై రామసుబ్బారెడ్డిని కలుపుకుని పోయే బాధ్యత డాక్టర్ సుధీర్‌పై ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రామసుబ్బారెడ్డి రాకతో తన సీటుకు ఎక్కడ ఎసరు వస్తుందోననే భయం ఇన్నాళ్లు డాక్టర్ సుధీర్‌రెడ్డిని వెంటాడుతోందని, అందువల్లే ఆయనంటే చిటపటలాడేవారని, సీఎం క్లారిటీతో ఇక ఆ భయాన్ని వదిలి హూందాగా వ్యవహరించాల్సిన కర్తవ్యం ఎమ్మెల్యేపై ఉందని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇకనైనా రామసుబ్బారెడ్డిని శత్రువుగా చూడడం మాని, వైసీపీ అధిష్టానం ఆశించినట్టు డాక్టర్ సుధీర్ జమ్మలమడుగులో పార్టీ మరింత బలోపేతానికి తనను మార్చుకుంటారని పార్టీ శ్రేణులు ఆకాంక్షిస్తున్నాయి.