రాజకీయాలే వృత్తిగా ఎంచుకున్న నాయకులకే ఒక్కోసారి రాజకీయాలంటే విసుగొస్తుంది. అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. ఓడిపోతుంటారు. గెలుస్తుంటారు. ఉన్న పార్టీలో గుర్తింపు లేకపోతే వేరే పార్టీలోకి పోతుంటారు. ఏవో ఢక్కామొక్కీలు తింటుంటారు. రాజకీయాల్లో తిప్పలు పడుతూనే ఏవో వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు. కాని ప్రధాన వృత్తి (ప్రజాసేవ కాదు) రాజకీయాలే. కాని సినిమా వారికి రాజకీయాలు ప్రధాన వృత్తి కాదు. పెద్ద స్టార్ హీరోలు కొందరు ఏకంగా ముఖ్యమంత్రి అయిపోవాలనే ఆశతో సొంత పార్టీ పెడతారు. కొందరు పెద్ద పార్టీలో చేరతారు. కాని అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పాలిటిక్స్‌కు గుడ్‌బై చెప్పేసి సినిమా రంగానికి వెళ్లిపోతారు.
ఉమ్మడి ఏపీలో అనుకున్న లక్ష్యాన్ని సాధించిన ఏకైక హీరో నందమూరి తారకరామారావు మాత్రమే. ఆయన స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన అనేకమంది నటులు, నటీమణలు, హీరోలు, క్యారెక్టర్ యాక్టర్లు మొదలైనవారిలో చాలా తక్కువమంది మాత్రమే దీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉంటున్నారు. ఎన్టీఆర్ తరువాత సంచలనాత్మకంగా రాజకీయరంగ ప్రవేశం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆయనకున్న ప్రజాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు కదా. తనకున్న మెగాస్టార్ ఇమేజ్‌తో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకోవచ్చని అనుకున్నారు. కాని అనేక కారణాలతో సొంత పార్టీ 'ప్రజారాజ్యం' నడపలేక దాన్ని కాంగ్రెసులో విలీనం చేసి, అందుకు ప్రతిఫలంగా కేంద్రంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. అదీ సహాయ మంత్రి పదవి అయినా ఇండిపెండెంట్ చార్జి కావడం గుడ్డిలో మెల్ల.
కేంద్రానికి వెళ్లాలంటే పార్లమెంటుకు వెళ్లాలి కాబట్టి కాంగ్రెసు నాయకత్వం ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా చేసింది. ఏదో పడుతూ లేస్తూ మంత్రి పదవిని మమ అనిపించారు. ఆ తరువాత కాంగ్రెసు ఓడిపోవడంతో ఇక ఆయనకు రాజకీయాలపై విరక్తి వచ్చింది. రాజ్యసభ సభ్యత్వం ముగిశాక రాజకీయ అధ్యాయాన్ని ముగించేశారు. కాని కాంగ్రెసు ఆయన మీద చాలా ఆశలు పెట్టుకుంది. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కీలకపాత్ర పోషిస్తాడనుకుంది. చిరంజీవి అండతో పార్టీకి పునర్వైభవం తేవచ్చని నాయకత్వం ఆశ పడింది. రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడిగా పెడదామనుకుంది.
కాని చిరంజీవి చలించలేదు. పార్టీ సభ్యత్వాన్ని కూడా పునరుద్ధరించుకోలేదు. దాంతో పూర్తి బంధం తెగిపోయింది. ఆ తరువాత బీజేపీ నాయకత్వం ఆయన కోసం ప్రయత్నించింది. రాయబారాలు నడిపినట్లు మీడియాలో వార్తలొచ్చాయి. మెగాస్టార్ సై అంటే ఏపీ బాధ్యతలు ఇవ్వాలనుకుంది. బీజేపీ ఆయన కోసం ప్రయత్నిస్తున్నట్లు మొన్నమొన్నటివరకూ వార్తలొచ్చాయి. కాని ఆయన ఎక్కడా టెంప్ట్ అవలేదు. రాజకీయాలకు తాను పనికి రానని అనుకున్నాడో, పాలిటిక్స్‌లో ఉంటే అన్నివిధాల నష్టపోవల్సి వస్తుందనుకున్నాడోగాని గట్టి నిర్ణయం తీసుకున్నాడు.
తాజాగా ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూ చేస్తూ…'రాజకీయాలపై మీరు మళ్లీ దృష్టి పెట్టబోతున్నారని, ఒక ప్రధాన పార్టీ నుంచి ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతోంది'.. అని అడగ్గా 'అది వాళ్ల ఆశ, ఆలోచన. దానిపై నేనెలా స్పందిస్తాను? నా దృష్టంతా సినిమాలపైనే' అని చెప్పారు చిరంజీవి. ఈయన ఓకే అంటే బీజేపీ ఎర్ర తివాచీ పరిచేందుకు సిద్ధంగా ఉంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీనే విలీనం చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ చిరంజీవి వస్తే బ్రహ్మరథం పడుతుంది. కాని ఆయన ఇక రాజకీయాల ఆలోచన చేయడనేది స్పష్టమైంది. ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉంది. తాను ఎనిమిదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నప్పుడు శరీరంపై నియంత్రణ కోల్పోయానని చిరంజీవి ఇంటర్వ్యూలో చెప్పారు.
వ్యాయామం చేయలేకపోయానని, వేళకు తినలేకపోయానని ఇది తనపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. నిజమే… రాజకీయాల్లో ఉంటే షేపులు మారిపోతాయి. ఆయన రాజకీయాలకు స్వస్తి చెప్పాక పాత చిరంజీవిలా తయారయ్యారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన అందరివాడుగా ఉండేవారు. వచ్చాక కొందరివాడయ్యారు. తిట్లు, శాపనార్థాలు, విమర్శలు తప్పలేదు. ఆయనతో నటించిన హీరోయినే విరుచుకుపడింది. కుల నాయకుడనే ముద్రపడింది. గట్టిగా, ధాటిగా మాట్లాడలేని చిరంజీవి రాజకీయాలకు పనికిరాడనేది వాస్తవం. జనం మనస్సుల్లో మెగాస్టార్‌గా ఉంటేనే మంచిది.