మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి రాబోతున్నారనగానే, ఆయన అభిమానులు పండగ షురూ చేసేశారు. మెగాస్టార్‌ని సోషల్ మీడియాలోకి వెల్‌కవ్‌ు చెబుతూ రకరకాల హ్యాష్‌ట్యాగ్‌లు షురూ అయిపోయాయి. గ్రాండ్ వెల్‌కమ్ మాత్రమే కాదు, అప్పుడే మెగాస్టార్ చిరంజీవికి వ్యతిరేకంగా ట్రోలింగ్ కూడా షురూ అయిపోతోంది. ఓ పక్క ప్రపంచమంతా కరోనా వైరస్‌తో విలవిల్లాడుతోంటే, ఈ గోలేంటి.? అంటూ మెగాభిమానులకి ఇతర హీరోల అభిమానుల నుంచి సెటైర్లు పడుతున్నాయి.
సోషల్ మీడియా అంటేనే ఇష్టమొచ్చినట్లు ‘వాగేందుకు’ ఓ వేదిక. అది ట్వీట్ల రూపంలో కావొచ్చు, వీడియోల రూపంలో కావొచ్చు, మరో రూపంలో కావొచ్చు… ట్రోలింగ్ మాత్రం తప్పదు. మరి, మెగాస్టార్ చిరంజీవి ఈ ట్రోలింగ్‌ని తట్టుకోగలరా.? అన్నదే అసలు ప్రశ్న. ‘ఈ గోల భరించలేకనే మేం సోషల్ మీడియాకి దూరంగా వుంటున్నాం..’ అని చాలామంది సెలబ్రిటీలు చెబుతుంటారు.
అయితే, ఈ రోజుల్లో సోషల్ మీడియా నుంచి దూరంగా వున్నాసరే, ట్రోలింగ్ ఆగదు. సో, సోషల్ మీడియాలోకి వచ్చి.. ట్రోలింగ్‌కి సరైన సమాధానం చెప్పడమే బెటర్.. అన్నది ఇంకొందరి వాదన. ఎవరి వాదనలు ఎలా వున్నా, సోషల్ మీడియాలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇస్తున్నారనగానే, ఆయన ఖాతాలో ఎంతమంది ఫాలోవర్స్ చేరతారు.? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారు.? అంటూ అభిమానుల అత్యుత్సాహం మాత్రం అప్పుడే పీక్స్‌కి చేరిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి అంటే కేవలం సినిమాలే కాదు కదా, రాజకీయ అంశాలపైనా ఆయన తన అభిప్రాయాల్ని పంచుకోవాల్సి వస్తుంది. పుట్టుకొచ్చే ప్రతి గాసిప్‌కీ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. మరి, అంత ఓపిక చిరంజీవిలో వుంటుందా.? ఇలాంటి అకౌంట్లను నిర్వహించేందుకు ఎవరో ఒకరు వుంటారు గనుక.. అన్నిటికీ కాకపోయినా, చాలా విమర్శలకీ, వివాదాలకీ, అనుమానాలకీ సమాధానాలు వచ్చే అవకాశమైతే లేకపోలేదు.