ఎంత పని చేశావ్ చిట్టిబాబు!

తన వ్యవహారశైలితో జగన్ సర్కారుకు ఎప్పటికప్పుడు తలనొప్పులు తెచ్చిపెడుతున్న పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు… తాజాగా మరోసారి వివాదాస్పదమయ్యారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో తన అధికారాన్ని ప్రదర్శించి, ఏకంగా ఎంపీడీవో సస్పెన్షన్ కు కారణమయ్యారు.…

తన వ్యవహారశైలితో జగన్ సర్కారుకు ఎప్పటికప్పుడు తలనొప్పులు తెచ్చిపెడుతున్న పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు… తాజాగా మరోసారి వివాదాస్పదమయ్యారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో తన అధికారాన్ని ప్రదర్శించి, ఏకంగా ఎంపీడీవో సస్పెన్షన్ కు కారణమయ్యారు.

వ్యాక్సిన్ కొరత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సెకెండ్ డోస్ మాత్రమే వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్తగా నమోదుచేసుకున్న వాళ్లెవరికీ టీకా ఇవ్వడం లేదు. ఆల్రెడీ మొదటి డోస్ వేసుకున్న వాళ్లకు మాత్రమే రెండో డోస్ ఇస్తోంది. అయితే చిట్టిబాబు మాత్రం తన జులం ప్రదర్శించినట్టు తెలుస్తోంది.

తన భార్య, కుమారుడు సహా.. తన సంబంధీకులు మరో 11 మందికి మొదటి డోస్ టీకా వేయించారు చిట్టిబాబు. ఈ మేరకు ఎంపీడీవో వెంకటేశ్వరరావుపై ఒత్తిడి తెచ్చి మరీ పని చేయించుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అమలాపురం సబ్-కలెక్టర్ విచారణ చేపట్టారు. ఈ విచారణ ఆధారంగా ఎంపీడీవోను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాత్రి ఆదేశాలు జారీచేశారు.

అలా చిట్టిబాబు అత్యుత్సాహంతో ఓ ప్రభుత్వ ఉద్యోగి సస్పెన్షన్ కు గురికావాల్సి వచ్చింది. ఓవైపు వ్యాక్సిన్ కొరత వేధిస్తుంటే, మరోవైపు ఇలా చిట్టిబాబు లాంటి ప్రజాప్రతినిథి ఇలా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి చిట్టిబాబు వ్యవహారశైలికి ఇదొక ఉదాహరణ మాత్రమే.

గతంలో కూడా పలుమార్లు వివాదాస్పదంగా వ్యవహరించారు చిట్టిబాబు. తన నియోజకవర్గం పరిథిలోని ఓ గూడెంకు అన్యాయం జరిగిందంటే అది మంత్రుల వల్లనే అంటూ సొంత పార్టీ నేతలపైనే గతంలో విమర్శలు గుప్పించారు.

దీంతోపాటు ఇసుక మాఫియాపై అప్పట్లో ఆయన చేసిన “గన్ కల్చర్” వ్యాఖ్యలు కలకలం రేపాయి. 2019లో తన కుమారుడి పుట్టినరోజు వేడుకల్ని అంబాజీపేటలో ఘనంగా నిర్వహించడం వల్ల..ఆ ప్రాంతం మొత్తం 2 గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయింది. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు.

ఇలా తన వ్యవహారశైలితో ఎప్పటికప్పుడు పార్టీకి తలనొప్పులు తెస్తున్న చిట్టిబాబు.. ఇప్పుడు తనకు సంబంధించిన వ్యక్తులకు కరోనా టీకా మొదటి డోస్ ఇప్పించి, ఎంపీడీవో సస్పెన్షన్ కు కారణమయ్యారు.