ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల, చిత్తూరు జిల్లాలో ఉంది కానీ, చిత్తూరు జిల్లా నేతలకు మాత్రం తాడేపల్లి ప్రముఖ పుణ్యక్షేత్రంలా కనిపిస్తోంది. అక్కడ ఉన్న జగన్ నే వారు దేవుడిలా కొలుస్తున్నారు. కారణం మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ. అవును, రెండేళ్ల తర్వాత మంత్రి వర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని ప్రమాణ స్వీకారం తొలిరోజే క్లారిటీ ఇచ్చారు జగన్. అలా చాలామందిలో ఆశలు సజీవంగా ఉంచారు. మరి టైమ్ దగ్గరపడుతోంది.
ఇప్పుడు సీఎం దృష్టిలో ఎవరున్నారు. రెండేళ్ల కాలంలో ఎవర్ని ఆయన హీరోలనుకుంటున్నారు, ఎవర్ని జీరోలుగా తీసిపారేయాలనుకుంటున్నారు. వీర విధేయ భక్తుల జాబితాలో ఎవరికి మంత్రి వర్గంలో ఎంట్రీ ఉంటుందనేది సస్పెన్స్ గా మారింది.
భక్తాగ్రేసరులుగా మారిన చిత్తూరు నేతలు..
చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం ఇద్దరికి మంత్రి పదవులున్నాయి. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి తన పదవిపై కాస్త బెంగ పెట్టుకున్నారు. విస్తరణలో తనకు పదవి ఉంటుందా, ఊడుతుందా అని భయపడుతున్నారు. అందుకే ఆయన సీఎం జగన్ ఫొటోతో ఉన్న ఉంగరాన్ని పెట్టుకుని రోజూ దానికే నమస్కారం పెట్టుకుంటున్నారు.
అప్పట్లో తమిళనాడులో జయలలిత ఫొటో ఉన్న ఉంగరాలు మంత్రులు, ఎమ్మెల్యేల చేతికి ఉండేవి. తమిళనాడు సరిహద్దు జిల్లా కావడంతో నారాయణ స్వామి కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. సీఎం బొమ్మ ఉన్న ఉంగరం డిప్యూటీ సీఎంకు ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.
ఆలయాల ప్రదక్షిణలో రోజా..
ఏపీఐఐసీ చైర్మన్ పదవి పోయిన తర్వాత రోజాలో మంత్రి పదవిపై ఆశలు చిగురించాయి. రోజా ఇటీవల వరుసగా ఆలయాల సందర్శనకు వెళ్తున్నారు. తిరుమల, శ్రీకాళహస్తి సహా.. రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాలన్నిటికీ వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తున్నారట రోజా. రోజా మొక్కులు ఏమేరకు ఫలిస్తాయో అతి త్వరలో తేలిపోతుంది.
గుండెల్లో గుడి కట్టేశా..
ఆమధ్య కరోనా కాలంలో కూడా ట్రాక్టర్ల ర్యాలీతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. తాజాగా జగన్ కి గుడి కట్టించి మరో సంచలనం సృష్టించారు. పేదలందరికీ ఇళ్లు కట్టిస్తున్న జగన్ దేవుడైతే, ఆ దేవుడికి తానెందుకు గుడి కట్టకూడదని ప్రశ్నిస్తున్నారు మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.
ఆషామాషీగా కాదు, ఏకంగా గుడి కోసం 3 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారట. జగనన్న నవరత్నాల ఆలయం పేరుతో జగనన్న కాలనీలోనే ఆయన గుడి కట్టించారు. ఇదంతా జగన్ పై అభిమానం తప్ప ఇంకేమీ కాదని చెబుతున్న మధుసూదన్ రెడ్డి.. మంత్రి పదవిపై కర్చీఫ్ కాదు, ఏకంగా కండువా పరిచేశారు.
మొత్తమ్మీద ఉంగరాలు, పూజలు, గుడులు.. వీటిల్లో దేనికి పెద్ద ప్రతిఫలం ఉంటుందో చూడాలి. ఇవేవీ కాదు పనితీరే గీటురాయి అని జగన్ అంటే మాత్రం ఇలాంటివారందరికీ అది పెద్ద షాకే.