నివర్ తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో అక్కడక్కడ కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రయాణాలకు ఎలాంటి విఘాతం కలగకుండా టీటీడీ సిబ్బంది ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టింది. యుద్ధ ప్రాతిపదికన ఘాట్ రోడ్డు మార్గాన్ని ప్రయాణాలకు అనుకూలంగా మార్చింది.
అయినప్పటికీ కొంతమంది తిరుమలపై అసత్య ప్రచారానికి దిగారు. ఆల్రెడీ అధికారికంగా నడకదారి మార్గాన్ని మూసేయగా.. అనధికారికంగా ఘాట్ రోడ్డును కూడా క్లోజ్ చేశారంటూ పుకార్లు రేకెత్తించారు. దీనిపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
తిరుమల ఘాట్ రోడ్డు పూర్తిస్థాయిలో ప్రయాణానికి అనుకూలంగా ఉందని, ఎలాంటి వదంతులు నమ్మొద్దని విజ్ఞప్తిచేశారు సుబ్బారెడ్డి. అక్కడక్కడ బండరాళ్లు పడిన మాట వాస్తవమేనని అంగీకరించిన సుబ్బారెడ్డి.. వాటిని యుద్ధప్రాతిపదికన తొలిగించామని, రోడ్డును సాఫీగా మార్చామని ప్రకటించారు.
ఈరోజు తిరుమలలో పాలకమండలి సమావేశం నిర్వహించిన సుబ్బారెడ్డి.. టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేశారు. 1974 నుంచి టీటీడీ అమ్మిన వ్యవసాయ, వ్యవసాయేత ఆస్తుల వివరాల్ని వెల్లడించారు. అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా 2014 వరకు అమ్మిన ఆస్తుల వివరాలు ప్రకటించారు.
మిగిలిన ఆస్తుల వివరాలన్నింటినీ వెబ్ సైట్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైనా వెబ్ సైట్ లోకి వెళ్లి టీటీడీ ఆస్తుల వివరాల్ని పరిశీలించుకోవచ్చని, ఇకపై ఆస్తుల వివరాలపై పూర్తి పారదర్శకతతో వ్యవహరిస్తామని ప్రకటించారు.