ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 16వ తేదీన అమెరికా వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ టూర్ గురించి ఏపీ ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసింది. మొత్తం వారంరోజుల పాటు జగన్ యూఎస్ టూర్ సాగనుందని తెలుస్తోంది. ఈ పర్యటన పూర్తిగా జగన్ వ్యక్తిగతం అని ప్రభుత్వం తెలిపింది.
ఈ పర్యటనకు సంబంధించిన ఖర్చులన్నీ జగన్ స్వయంగా పెట్టుకుంటున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ పర్యటనలో జగన్ వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు. ప్రయాణ, పర్యటన ఖర్చులతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ప్రకటనలో తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా జగన్ మోహన్ రెడ్డి తన కూతురును అమెరికాలోని ఒక వర్సీటీలో చేర్పించబోతున్నారని తెలుస్తోంది. ఇండియానాలోని నోట్రే డేమ్ యూనివర్సిటీలో జగన్ చిన్న కూతురు యూజీ కోర్సులో చేరబోతోందని తెలుస్తోంది.
ఇక ఈ పర్యటనలోనే జగన్ మోహన్ రెడ్డి ప్రవాసాంధ్రులతో సమావేశం కాబోతున్నారు. పెట్టుబడిదారులనూ కలవబోతున్నారు. ఆగస్టు 16-18 ల మధ్యన జగన్ మోహన్ రెడ్డి వాషింగ్టన్ డీసీ, డల్లాస్ లలో ప్రవాసాంధ్రులతో సమావేశం కాబోతున్నారు. 22న తిరుగు ప్రయాణానికి ముందు షికాగోలో వ్యాపారవేత్తల సదస్సులో జగన్ మోహన్ రెడ్డి పాల్గొనబోతూ ఉన్నారు.