2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చివరి ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఐదేళ్లకు రావాల్సిన ఎన్నికలు ఏడాది ముందుగానే తెలంగాణలో 2018లో వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఆ ముందస్తు ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నారు కేసీఆర్. 2023లో రావాల్సిన ఎన్నికలను 2022లోనే జరిపేందుకు ప్రణాళికలు రచిస్తున్నారట. ఇంతకీ కేసీఆర్ ముందస్తు వ్యూహం ఎందు కోసం..? ఎవరి కోసం..?
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల చరిత్ర ఇది
తెలంగాణల అసెంబ్లీలో 119 స్థానాలున్నాయి. 2014లో టీఆర్ఎస్ కి 63 సీట్లు వచ్చాయి. అదేమంత గొప్ప మెజార్టీ కాదు. బొటాబొటి స్థానాలు గెలుచుకున్నారు కేసీఆర్. అయితే ఆ తర్వాత పార్టీలకతీతంగా అందరికీ టీఆర్ఎస్ కండువాలు కప్పేసి టీడీపీ, కాంగ్రెస్ కి శాసన సభాపక్షమే లేకుండా చేశారు. అప్పటికీ ఆయన సంతృప్తి పడలేదు.
ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికీ ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయనే నెపంతో ఏడాది ముందుగా 2018లోనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ ఫలితాలు మరీ ఏకపక్షంగా ఏమీ రాలేదు. ఈసారి 25 సీట్లు పెరిగాయి. కేసీఆర్ 100 సీట్ల టార్గెట్ పెట్టుకుంటే స్కోర్ 88 వద్దే ఆగిపోయింది. ఆ తర్వాత కూడా మళ్లీ వలసల పర్వం కొనసాగింది.
అయితే ఈసారి కేసీఆర్ కి వరుసగా ఎదురు దెబ్బలు తగలడం మొదలయ్యాయి. దుబ్బాక, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. దుబ్బాకలో అభ్యర్థి మారితే, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థే బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ గుర్తుపై గెలిచారు. ఒకరకంగా ఈ అవమానాలతో కేసీఆర్ కాస్త సైలెంట్ అవుతారని అనుకున్నారంతా. కానీ అసలు విషయం అప్పుడే మొదలైంది.
తెలంగాణలో బీజేపీ బలపడుతుందని గ్రహించిన కేసీఆర్.. కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వారు. రైతుల్ని రెచ్చగొట్టి ఏకంగా సీఎం కూడా రోడ్లపై కూర్చున్నారు, ధర్నాలు చేశారు. ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఆ వెంటనే ఇప్పుడు రైతు చట్టాల రద్దుకి కేంద్రం సిద్ధపడటంతో పైచేయి నాదేనంటూ కదం తొక్కారు.
వచ్చే ఏడాది యూపీ, పంజాబ్ సహా మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతుందనే అంచనాలున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ కూడా ఆ రాష్ట్రాలతో కలసిపోవాలని చూస్తున్నారు. ఎలాగూ బీజేపీకి దేశవ్యాప్తంగా నెగెటివ్ వేవ్ ఉంది కాబట్టి.. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్తే ఆ ప్రభావం ఇక్కడ కూడా పనిచేస్తుందని ఆలోచిస్తున్నారు.
తెలంగాణలో బీజేపీని బలపడకుండా చేయాలన్నా, కాంగ్రెస్ కి అవకాశం లేకుండా చేయాలన్నా.. మందస్తుకి వెళ్లడమే మార్గమనేది ఉత్తమమని కేసీఆర్ ఆలోచన.. మరి ఈ వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తారా.. లేక ఐదేళ్ల టర్మ్ ముగిసేవరకు ఎదురుచూస్తారా అనేది తేలాల్సి ఉంది.