హైదరాబాద్‌లో ఇటీవల ముగ్గురు కిడ్నాప్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కిడ్నాప్‌లో మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ అరెస్ట్ కావడం, ఆమె భర్త భార్గవ్‌రామ్ పరారు కావడంతో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
కిడ్నాప్‌నకు గురైన ముగ్గురు సీఎం కేసీఆర్ బంధువులని పెద్ద ఎత్తున మీడియాలో ప్రచారమైంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ సొంత అన్న కుమార్తె కల్వకుంట్ల రమ్యారావు పలు మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో సంచలన కామెంట్స్ చేశారు.
కల్వకుంట్ల రమ్యారావు రెండేళ్ల క్రితం వరకూ కాంగ్రెస్‌లో క్రియాశీలక నాయకురాలిగా ఉన్నారు. ఈ సందర్భంగా తన బాబాయ్ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై దుమ్మెత్తి పోశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి తరఫున కూకట్ పల్లి టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని గెలుపు కోసం ఆమె విస్తృత ప్రచారం చేశారు. ప్రజాకూటమి ఘోర పరాజయం తర్వాత ఆమె కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు.
తాజాగా మరోసారి ఆమె మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర, ఆశ్చర్యకర విషయాలు చెబుతున్నారు. హఫీజ్‌పేట భూవ్యవహారంలో కిడ్నాప్‌నకు గురైన ముగ్గురు అసలు ముఖ్యమంత్రికి బంధువులే కారని తేల్చి చెప్పారు.
కిడ్నాప్‌నకు గురైన ప్రవీణ్‌రావు, ఆయన సోదరులు కేవలం తమ కులం (వెలమ) మాత్రమేనని చెప్పుకొచ్చారు. వారంతా మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ వాసులని చెప్పారు. పేరు చివరిలో రావు అని ఉన్నవాళ్లంతా ముఖ్యమంత్రికి బంధువులు అవుతారా? అని ఆమె ప్రశ్నించడం గమనార్హం.
ఇదే సందర్భంలో మరో సంచలన విషయాన్ని చెప్పారు. కిడ్నాప్‌నకు పాల్పడిన రాత్రి కేసీఆర్ కుమార్తె , ఎమ్మెల్సీ కవితను అఖిలప్రియ షెల్టర్ కోరారనే కొత్త విషయాన్ని రమ్య తెరపైకి తెచ్చారు. కవిత వ్యక్తిగత సెల్ నంబర్ బంధువులైన తమ వద్దే లేదని, అలాంటిది అఖిలప్రియ వద్ద ఉందంటే, వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉందని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని రమ్య తెలిపారు.
కిడ్నాప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిలప్రియకు పోలీసులు ఫోన్ చేయగా, తాను కేసీఆర్ కుమార్తె కవిత వద్ద ఉన్నానని చెప్పినట్టు ….పోలీసులు చెబుతున్నారని కల్వకుంట్ల రమ్యారావు తెలిపారు.
పోలీసుల ట్రేస్ అవుట్‌లో కూడా కవిత ఇంటి సమీపంలో అఖిలప్రియ ఫోన్ సిగ్నల్స్‌తో పాటు కారు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారని రమ్య వెల్లడించారు. అఖిలప్రియ కిడ్నాప్‌నకు పాల్పడిందని కవిత భర్త దృష్టికి పోలీసులు తీసుకెళ్లడంతో, ఆమెకు షెల్టర్ ఇవ్వడానికి నిరాకరించారని తెలిసిందని ఆమె చెప్పుకొచ్చారు.
ఒకవేళ అఖిలప్రియకు కవిత షెల్టర్ ఇచ్చి ఉంటే ఆమెపై నిందలొచ్చేవని ఆమె తెలిపారు. మొత్తానికి తెలంగాణ సీఎం కేసీఆర్ అన్న కూతురు పలు మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కవిత -అఖిలప్రియ మధ్య సంబంధాల గురించి చెబుతున్న విషయాలు సరికొత్త వివాదానికి దారి తీసేలా ఉన్నాయి. అర్ధరాత్రి కవితకు అఖిల ఫోన్ చేయడం, ఆమె ఇంటి వద్దకెళ్లడం తదితర అంశాలు ప్రతిపక్షాలకు ఆయుధాలు అందించినట్టు అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.