దేశ అవసరానికి తగ్గట్టుగా వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు సూటిగా తేల్చేస్తున్నాయి. కేంద్రం చేతిలో ఉన్న అంశమని, వ్యాక్సిన్ తయారీకి వేరే కంపెనీలకూ అవకాశం ఇవ్వాలని సూచిస్తున్నాయి. అయితే ఈ విషయంపై స్పందించడం లేదు కానీ, వ్యాక్సిన్ డోసులకు మధ్యన వ్యవధిని పెంచే ప్రయత్నంలో ఉంది కేంద్ర ప్రభుత్వ నిపుణులు కమిటీ!
తొలి డోస్ వేసుకున్న వారు రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవధిని అమాంతం పెంచాలని కేంద్రం భావిస్తున్నట్టుగా ఉంది. ఈ మేరకు నిపుణుల కమిటీ పేరుతో వార్తలు వస్తున్నాయి.
కోవీ షీల్డ్ తొలి డోస్ కూ రెండో డోస్ కు మధ్య వ్యవధిని ఏకంగా 16 వారాలకు పెంచేసేట్టుగా ఉన్నారు. ఇది వరకూ నాలుగు నుంచి ఆరు, ఎనిమిది వారాలు అని చెప్పారు. ఇప్పుడు 16 వారాలు అయినా ఫర్వాలేదంటున్నారు. బహుశా వ్యాక్సిన్ ఉత్పత్తి తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ గడువులు పెంచుతున్నారని సామాన్యులకు అనిపిస్తే తప్పు ప్రజలది కాదు.
ఇక ఆల్రెడీ ఒకసారి కోవిడ్-19కు గురై, కోలుకున్న వారి గురించి కూడా కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ మరో మాట చెప్పింది. వీరైతే ఆరు నెలల వరకూ ఎలాంటి వ్యాక్సిన్ పొందనక్కర్లేదని ఈ కమిటీ అంటోంది. ఆరు నెలల వరకూ వీరిలో సహజమైన ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి.. ఇప్పటికే కోవిడ్ వచ్చి పోయిన వారికి వ్యాక్సిన్ ఏదీ అవసరం లేదనేది నిపుణుల కమిటీ మాట!
మొత్తానికి వ్యాక్సిన్ డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ గడువు పొడిగింపు లాజిక్ లు వినిపిస్తూ ఉన్నాయేమో అని సామాన్యులకు అనిపించవచ్చు. అయితే.. ఒకవేళ ఈ నెలాఖరుకు కోవిడ్-19 వేవ్ తగ్గుముఖం పడితే ప్రజలు కూడా మళ్లీ ఇప్పుడప్పుడే వ్యాక్సిన్ గురించి ఆలోచించడం తగ్గిస్తారు. ఇప్పుడు కూడా పల్లెల్లో వ్యాక్సిన్ కోసం అతి ఆరాటం ఏమీ లేదు. ఇస్తే వేసుకుందాం అనే ఆలోచనతో ఉన్నారు ప్రజలు. అలాంటి వారికి కొత్త రకం మాటలు చెబుతూ వ్యాక్సిన్ పై ఆశలను తగ్గించి వేస్తున్నాయి నిపుణుల కమిటీలు.
ఈ పరిస్థితుల్లో ప్రజలు అర్థం చేసుకోగలిగిన విషయం మాత్రం ఒకటే, కోవీషీల్డ్, కో వ్యాక్సిన్ లు వేయించుకున్న వారికి కూడా కరోనా సోకుతోంది. ఇది వాస్తవం. ఒక డోస్ వేయించుకున్న వారికి, రెండో డోస్ వేసుకున్న వారికి కూడా రెండు వారాల తర్వాత కరోనా సోకి, మైల్డ్ సింప్టమ్స్ ఉన్న దాఖలాలున్నాయి.
కాబట్టి.. వ్యాక్సిన్ లను నమ్ముకోవడం కన్నా, వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. కరోనా ను జయించే ఇమ్యూనిటీ నూటికి 99 మందికీ ఉంది. అలాగని కరోనాకు ఎదురెళ్లకుండా, వస్తే ఎలా అని కూడా భయపడకుండా.. వ్యాక్సిన్ ల గురించి ప్రభుత్వాలు చెప్పే తలో మాటలు వింటూ దాని గురించి అతిగా ఆలోచించకుండా, వీలైనంతగా కరోనా సోకుండా జాగ్రత్తలు తీసుకోవడమే ఉత్తమమైనది.