సృష్టిలో ఎక్కడో జరిగే ఒక పరిణామానికీ, మరెక్కడో జరిగే ఇంకో పరిణామానికీ సంబంధం ఉంటుందనేది ఒక థియరీ. అదేమో కానీ రాజకీయాల్లో మాత్రం ఎక్కడో ఏదో జరుగుతుంది, దాని పరిణామాలు మరెక్కడో కనిపిస్తూ ఉంటాయి. రాజస్తాన్ రాజకీయానికి, కశ్మీర్ లోయ రాజకీయానికి ముడిపెడుతున్న వ్యవహారం ఇది! రాజస్తాన్ లో బీజేపీ కొత్త దోస్త్ కశ్మీరీ అల్లుడు కదా, ఈ అల్లుడితో దోస్తీ కుదిరిన నేపథ్యంలో, లోయలో ఇతడి మామా-బావలకు రిలీఫ్ లభించిందనే టాక్ మొదలవుతోంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు ప్రస్తావిస్తూ ఉన్నారు.
చత్తీస్ గఢ్ సీఎం, కాంగ్రెస్ నేత భూపేష్ బాగేల్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. సచిన్ పైలట్ తో బీజేపీకి దోస్తీ కుదరడంతో కశ్మీర్ లో ఒమర్ అబ్ధుల్లా, ఫరూక్ అబ్దుల్లాలను హోం అరెస్ట్ నుంచి విడుదల చేశారని బాగేల్ పదునైన బాణాన్ని సంధించారు.
కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి లోయలో పలువురు రాజకీయ నేతలను గృహనిర్భంధంలో ఉంచడం, అరెస్టు చేయడం చేసింది ప్రభుత్వం. ఇలా హౌస్ అరెస్ట్- అరెస్ట్ అయిన నేతల్లో ఫరూక్, ఒమర్ తో పాటు పీడీపీ నేత ముఖ్య నేత మెహబూబా ముఫ్తీ తదితరులున్నారు. మెహబూబాను అయితే జైల్లో పెట్టినట్టుగా ఉన్నారు. అబ్దుల్లాలను మాత్రం ఇంటిలోనే ఇన్నాళ్లూ నిర్బంధించారు. ఇప్పుడు వారికి ఆ ఇబ్బంది కూడా లేదట! వారిని పూర్తి స్వేచ్ఛగా విహరించేందుకు అవకాశం ఇచ్చిందట ప్రభుత్వం. ఈ నేపథ్యంలో.. ఇదంతా సచిన్ పైలట్ తో బీజేపీ డీల్ లో భాగమే అనేది కాంగ్రెస్ నేత ఆరోపణ.
రాజస్తాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఇలా కశ్మీర్ లో సచిన్ మామను, బావను విడుదల చేసిందని అంటూ సీఎం భూపేష్ విరుచుకుపడ్డారు. ఎవరినైతే ఇన్నాళ్లూ వేర్పాటు వాదులుగా, కశ్మీర్ లో అశాంతిని రగులుస్తున్న వారని బీజేపీ నిందించిందో రాజస్తాన్ లో తమ దోస్తు కోసం వారినే విడుదల చేసింది అంటూ ఆయన ఎండగట్టారు. బీజేపీ మాజీ దోస్తు మెహబూబా ముఫ్తీని, అబ్ధుల్లాలను ఒకే సెక్షన్ కింద అరెస్టు చేశారని, మెహబూబాను మాత్రం విడుదల చేయకుండా, అబ్దుల్లాలను మాత్రం విడుదల చేయడమేమిటి? అంటూ కూడా ఆయన ప్రశ్నించారు! ఈ విషయంలో బీజేపీ స్పందించంలేదు కానీ, ఒమర్ అబ్దుల్లా మాత్రం స్పందించారు. భూపేష్ మీద కోర్టుకు వెళ్తామని ఆయన ప్రకటించేశారు.
ఏదేమైనా.. కాంగ్రెస్ పదేళ్ల హయాంలో చక్రం తిప్పిన అబ్దుల్లాల అల్లుడు సచిన్ పైలట్ ను బీజేపీ చేర్చుకుని రాజకీయం చేస్తే, ఇక ఆ పార్టీ ప్రవచించే కాంగ్రెస్ వ్యతిరేక జాతీయవాద రాజకీయం గొంగట్లో కూర్చుని వెంట్రుకలు ఏరుకున్నంత ముచ్చటగా ఉంటుందేమో!