కరోనా రెండో దశ ప్రారంభమైన తర్వాత లాక్ డౌన్ పై ప్రభుత్వాలన్నీ వెనక్కి తగ్గాయి. తెలంగాణలో అస్సలు లాక్ డౌన్ ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తెగేసి చెప్పారు. అయితే ఏపీలో మాత్రం పాక్షిక లాక్ డౌన్ కు ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా కరోనా సెకెండ్ వేవ్ లో తొలి లాక్ డౌన్ గుంటూరు జిల్లాలో పడింది.
వేగంగా పెరుగుతున్న కరోనా కేసుల్ని దృష్టిలో పెట్టుకొని గంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో లాక్ డౌన్ విధించారు. ఈరోజు నుంచి వారం రోజుల పాటు మండలం అంతా కఠిన లాక్ డౌన్ కొనసాగుతుంది. కేవలం ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే షాపులు తెరుస్తారు. అది కూడా నిత్యావసరస వస్తువులు అమ్మే షాపులు మాత్రమే. ఆ తర్వాత పూర్తిగా లాక్ డౌన్ అమల్లో ఉంటుంది.
ఇలా వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించి, ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ ప్రకటించారు. గుంటూరు జిల్లా తరహాలోనే ఇతర జిల్లాల్లో కూడా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రాంతాల్లో కఠిన లాక్ డౌన్ అమలు చేసే అవకాశం ఉంది.
తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 993 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9లక్షలకు చేరువైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 6614 యాక్టివ్ కేసులున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఈరోజు నుంచి దేశవ్యాప్తంగా 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి కరోనా టీకా వేయబోతున్నారు. ఇప్పటివరకు 60 ఏళ్లు దాటిన వ్యక్తులకు, 45 దాటి వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులకు మాత్రమే టీకాలు వేశారు. ఇవాళ్టి నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు టీకా వేయించుకోవచ్చు. ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఈరోజు గుంటూరులో టీకా వేయించుకోబోతున్నారు.