అవగాహనలేమి.. అపరిశుభ్ర వాతావరణం.. నిరక్షరాస్యతతో వచ్చిన నిర్లక్ష్యం.. ఇవన్నీ కలిసి పల్లెల్ని కరోనా కమ్మేస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పట్టణాల కంటే పల్లెల్లోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అంతేకాదు.. కరోనా మరణాల సంఖ్య కూడా ఏపీ పల్లెల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది.
పెద్దగా రవాణా సౌకర్యం లేని పల్లెల్లోకి కూడా కరోనా ప్రవేశించి అతలాకుతలం చేస్తోంది. బాధాకరమైన విషయం ఏంటంటే.. తమకు కరోనా సోకిందనే విషయం తెలుసుకునేలోపే చాలామంది ప్రాణాలు కోల్పోతుండగా.. సాధారణ జలుబు-జ్వరం మాత్రమే అనే నిర్లక్ష్యంతో మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు.
పల్లెల్లో ఎక్కువగా స్థానికంగా ఉండే ఆర్ఎంపీల పైనే ఆధారపడుతుంటారు. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలకు పట్టణాల వరకు వెళ్లడానికి ఎవ్వరూ మొగ్గుచూపరు. సరిగ్గా ఇక్కడే సమస్య తీవ్రమౌతోంది. ఆర్ఎంపీలకు అవగాహన లేకపోవడం, డబ్బులకు కక్కుర్తి పడి సొంత వైద్యం చేయడంతో కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరిగిపోతోంది. దీనికితోడు తనకు తెలియకుండానే ఓ కరోనా పేషెంట్ ను పరీక్షించిన ఆర్ఎంపీ, అదే చేత్తో ఇతర రోగులను కూడా తాకడంతో కరోనా కేసులు రెట్టింపు అవుతున్నాయి.
పల్లెల్లో కేసుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం ఆర్ఎంపీల నిర్లక్ష్యమే. ముఖానికి మాస్క్ పెట్టుకోవడం మినహాయిస్తే.. డబ్బు ఖర్చవుతుందని ఎవరూ హ్యాండ్ శానిటైజర్లు, గ్లౌజులు వాడడం లేదు.
గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో పాజిటివ్ కేసుల సంఖ్య 10వేలకు తగ్గకుండా నమోదవుతున్నాయి. వీటిలో అత్యథిక కేసులు గ్రామీణ ప్రాంతాల్లోనే వెలుగుచూస్తున్నాయి. ప్రకాశం, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు, విజయనగరం జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో అత్యథికం గ్రామీణ ప్రాంత కేసులే. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా కేసులు నమోదువుతున్న జిల్లాల్లో ప్రకాశం టాప్ లో ఉంది. ఈ జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో 69శాతం కేసులు పల్లెల్లోంచే కనిపిస్తున్నాయి.
ప్రకాశం జిల్లా తర్వాత విజయనగరం జిల్లా పల్లెల నుంచి ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. విజయనగరం జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో 67శాతం కేసులు గ్రామీణ ప్రాంతాల నుంచి వెలుగుచూస్తున్నాయి. మూడో స్థానంలో శ్రీకాకుళం, నాలుగో స్థానంలో నెల్లూరు, ఐదో స్థానంలో కడప జిల్లాలు ఉన్నాయి. ఈ 5 జిల్లాల నుంచి సగటున సగం కేసులు పల్లెల నుంచే నమోదవుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా వల్ల మరణిస్తున్న వాళ్లలో 57శాతం మంది గ్రామీణ ప్రాంత వాసులే ఉంటున్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో పాటు సకాలంలో గుర్తించకపోవడం వల్లనే ఈ మరణాలు సంభవిస్తున్నాయి.
అటు తెలంగాణలో కూడా పరిస్థితి దాదాపు ఇలానే ఉంది. మొన్నటివరకు జీహెచ్ఎంసీ పరిధికి మాత్రమే పరిమితమైన వైరస్ తీవ్రత.. ఇప్పుడు తెలంగాణ పల్లెలకూ వ్యాపించింది. నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, సిద్ధిపేట జిల్లాల్లో పట్టణాల కంటే పల్లెల్లోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తరహాలో తెలంగాణలో సమగ్రమైన వివరాలు, సర్వేలు లేకపోవడం వల్ల పూర్తిస్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం కష్టంగా మారుతోంది.