భారత్ లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటింది. నిన్న కొత్తగా నమోదైన 4970 కేసులతో కలుపుకుంటే.. దేశంలో కరోనా బాధితుల సంఖ్య 101139కు చేరుకుంది. ఓవరాల్ గా చూసుకుంటే 12 రోజుల్లో కరోనా కేసుల సంఖ్య ఇండియాలో రెట్టింపు అయింది.
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనా వల్ల 134 మంది మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3163కు చేరుకుంది. ప్రస్తుతం 39వేల మందికి పైగా డిశ్చార్జ్ అవ్వగా.. 58,802 మంది చికిత్స పొందుతున్నారు.
మహారాష్ట్రలో కరోనా ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. నిన్న కొత్తగా మరో 2005 కేసులు వెలుగుచూశాయి. కంటైన్మెంట్ జోన్లపై కఠినంగా ఆంక్షలు విధించి, లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో ప్రజలు లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించడంతో కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు మహారాష్ట్రలో 1249 మంది మృత్యువాతపడ్డారు.
అటు తమిళనాడు, గుజరాత్ లో గడిచిన 2 రోజులతో పోలిస్తే కేసుల సంఖ్య తగ్గింది. తమిళనాడులో కొత్తగా 536 కేసులు నమోదు కాగా.. గుజరాత్ లో 366 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా చూసుకుంటే.. మహారాష్ట్ర తర్వాత 11,760 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో ఉంది. 11,745 కేసులతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది.
గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో 80శాతానికి పైగా కేసులు మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీలోనే నమోదయ్యాయి. ఒక్క ముంబయిలోనే కేసుల సంఖ్య 21వేలు దాటింది. కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 3.1శాతానికి తగ్గగా.. కోలుకున్న వారి శాతం 38శాతానికి పెరిగింది.
ఇవాళ్టి నుంచి ఇండియాలో లాక్ డౌన్-4 పేరిట నిబంధనల్ని పూర్తిగా సడలించారు. ప్రజారవాణా వ్యవస్థ, ఇతర దుకాణాలకు కూడా అనుమతిచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.