మొన్నటి వరకూ కరోనా పెద్దగా ప్రభావం చూపని దేశాల జాబితాలో నిలిచింది రష్యా. చైనాతో సుదీర్ఘమైన సరిహద్దును పంచుకునే దేశం రష్యా. అయినా కూడా ఆ దేశంలో కరోనా వైరస్ ప్రభావం కనిపించకపోవడం పట్ల పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. చైనా ఏదో కుట్ర పూర్వకంగా వ్యవహరిస్తూ ఉందని, అందుకే రష్యా సేఫ్ జోన్లో ఉందని, కరోనా రెమిడీని రష్యాతో చైనా పంచుకుందనే అభిప్రాయాలు కూడా వినిపించడం మొదలుపెట్టాయి. అయితే ఇంతలోనే కరోనా విషయంలో అటెండెన్స్ వేయించుకుంటూ ఉంది రష్యా కూడా!
ఆ దేశంలో ఇప్పటి వరకూ వెయ్యికి పైగా కరోనా పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయినట్టుగా తెలుస్తోంది. ఒక్క శుక్రవారం మాత్రమే 196 కొత్త కేసులు రిజిస్టర్ అయినట్టుగా రష్యా ప్రకించింది. మొత్తం కరోనా పేషెంట్లలో నలుగురు చనిపోయినట్టుగా కూడా వివరించింది. ఇప్పటికే కరోనా నివారణ విషయంలో రష్యా చాలా చర్యలే తీసుకుంది.
విదేశీయులను తన దేశంలోకి అడుగుపెట్టనీయడం లేదు. ఆ పై చైనాతో నాలుగు వేల కిలోమీటర్ల పొడవున ఉన్న సరిహద్దును రష్యా మూసి వేసింది. అయినా కూడా కాస్త లేటుగా అయినా రష్యాలో కరోనా పాజిటివ్ కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇలా మరో పెద్ద దేశంలో కూడా కరోనా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకూ కరోనా చేత తక్కువ ప్రభావితం అయిన దేశాలు కొన్నే ఉన్నాయి. రష్యా కూడా ఇప్పుడు కరోనా ప్రభావిత దేశంగా తేలింది. ఇక మిగిలినవి సౌత్ అమెరికన్, ఆఫ్రికా దేశాలు.