పోలీస్ స్టేషన్లలో కూడా కరోనా కేసులు

కరోనా వైరస్ దెబ్బకి కొత్త కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి, కొత్త కొత్త కేసులతో వారు జైళ్లలోకి వెళ్లాల్సి వస్తోంది. ఏపీలో తొలి కరోనా కేసు అంటూ తిరుపతిలో ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ హడావిడి…

కరోనా వైరస్ దెబ్బకి కొత్త కొత్త నేరాలు పుట్టుకొస్తున్నాయి, కొత్త కొత్త కేసులతో వారు జైళ్లలోకి వెళ్లాల్సి వస్తోంది. ఏపీలో తొలి కరోనా కేసు అంటూ తిరుపతిలో ఓ టీవీ ఛానెల్ రిపోర్టర్ హడావిడి చేసి ఆ తర్వాత పోలీస్ కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది. నెల్లూరులో కరోనా చికిత్స పొందుతున్న వ్యక్తి ఐసోలేషన్ వార్డ్ నుంచి పారిపోయాడని ఓ ఫేక్ న్యూస్ వాట్సప్ గ్రూపుల్లో పెట్టిన యువకుడు ఇప్పుడు ఊచలు లెక్కబెడుతున్నాడు. కరోనా వైరస్ మనలాంటి ఉష్ణ దేశాల్లో బతకదు, మనకేం భయం లేదంటూ ఓ డాక్టర్ వాట్సప్ గ్రూపుల్లో వీడియో షేర్ చేసి ఇబ్బందుల్లో పడ్డాడు.

ఇక యూట్యూబ్ ఛానెళ్లలో వచ్చే ఫేక్ న్యూస్ పై కూడా ప్రభుత్వం పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది. హోమియో మందులతో కరోనా నయమవుతుందని ప్రచారం చేసేవారిపై కూడా కేసులు పెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కోల్ కతాలోని ఓ బీజేపీ లీడర్ పై ఏకంగా మూడు సెక్షన్లపై పోలీసులు కేసులు పెట్టి లోపలికి తోశారు. నారాయణ్ చటర్జీ అనే ఓ బీజేపీ నేత ఉత్తర కోల్ కతాలో ఓ వైద్య శిబిరం ఏర్పాటు చేశాడు. అక్కడికి వచ్చినవారందరికీ కరోనా నివారణకు గోమూత్రం తాగాలని చెప్పాడు.

చెప్పడమే కాదు, తాను సిద్ధం చేసుకున్న గోమూత్రాన్ని అందరికీ తలా కొంత తాగించాడు. వీరిలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కూడా ఉన్నారు. ఈ విషయం ఆనోటా ఈనోటా బాగా ప్రచారం పొందింది. కరోనాకి దేశీ వైద్యం అంటూ జరిగిన ఆ ప్రచారం చూసి మిగతా బీజేపీ నాయకులు కూడా అలాంటి కార్యక్రమాలు పెట్టాలని ఆలోచించారు. పనిలో పనిగా గోమూత్రానికున్న ప్రాధాన్యత చెప్పాలనుకున్నారు.

అయితే అక్కడే వ్యవహారం బెడిసికొట్టింది. ఎలాగైనా బీజేపీని దెబ్బకొట్టాలని చూస్తున్న సీఎం మమతా బెనర్జీ ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే గోమూత్రాన్ని తాగించిన వ్యక్తిపై కేసులు పెట్టాలని సూచించారు. ఇంకేముంది.. గోమూత్రం దెబ్బకి మూడు కేసుల్లో బుక్కై కటకటాల వెనక్కు వెళ్లాడు నారాయణ చటర్జీ. ఇప్పుడు కరోనా కేసులు ఆస్పత్రుల కంటే పోలీస్ స్టేషన్లలో ఎక్కువగా నమోదవుతున్నాయి.

సో… అత్యుత్సాహవంతులూ తస్మాత్ జాగ్రత్త. ప్రచారానికి పోయి చిక్కులు తెచ్చుకోవద్దు. అరకొర జ్ఞానంతో వాట్సప్ వీడియోలు చేసి పోలీస్ స్టేషన్ల వరకూ వెళ్లొద్దు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనాకు సంబంధించిన కేసులు పోలీస్ స్టేషన్లలో జోరుగా నమోదవుతున్నాయి.

ద్యేవుడా…బ‌ట్ట‌ల్లేకుండా క‌నిపించ‌డం స్టార్ హీరోయిన్‌కు స‌ర‌దా అట‌!

తను పక్కన ఉంటే అన్నీ మర్చిపోతా