దాదాపు రెండేళ్ల తర్వాత దేశంలో కరోనా కేసుల సంఖ్య అతి తక్కువ స్థాయికి చేరుతోంది. 2020 ఏప్రిల్ 17న దేశంలో తొలి సారి ఒకే రోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అప్పట్లో రోజు వారీ కేసుల సంఖ్య వెయ్యిని దాటేయడం భయానక అంశంగా నిలిచింది. దేశంలో అప్పటికే స్ట్రిక్ట్ లాక్ డౌన్ అమల్లో ఉంది. ఒకవైపు లాక్ డౌన్ కష్టాలు, మరోవైపు అలా పెరుగుతున్న కరోనా కేసులు దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అప్పట్లో ఒక్క రోజులో వెయ్యికి పైగా కేసులు నమోదు కావడం కూడా భయాన్ని పెంచే అంశం గా నిలిచింది.
ఆ తర్వాత కరోనా కరాళ నాట్యంలో.. దేశం పెద్ద నంబర్లనే చూసింది. రోజుకు వెయ్యికే భయపడ్డ రోజుల నుంచి.. రోజుకు నాలుగైదు లక్షల అధికారిక కేసులు నమోదయ్యేంత వరకూ కరోనా పీక్ స్టేజీ కొనసాగింది. నెలల తరబడి కరోనా చీకటి రోజులు గడిచాయి. మూడు వేవ్ లలో కరోనా తన ప్రతాపం చూపించింది. మూడో వేవ్ తర్వాత దేశంలో పరిస్థితులు దాదాపు సాధారణ స్థితికి వస్తున్నాయి.
చాలా రాష్ట్రాల్లో బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు వద్దంటున్నారు. తమిళనాడు ప్రభుత్వం.. వ్యాక్సినేషన్ విషయంలో కూడా రిలాక్సేషన్ ఇచ్చింది. వ్యాక్సినేషన్ చేయించుకున్న వాళ్లే ప్రవేశానికి అర్హులు ఉన్న చోట్లను కూడా మినహాయింపుల జాబితాలోకి చేర్చింది. వ్యాక్సినేషన్ చేయించుకోని వారు కూడా.. అంటూ మెన్షన్ చేసింది.
ఇక 717 రోజుల తర్వాత దేశంలో రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి లోపుకు చేరింది. గత ఇరవై నాలుగు గంటల్లో 922 కేసులు నమోదయ్యాయి. ఏపీలో అయితే రెండు వేలకు పైగా పరీక్షలు చేయగా.. కేవలం ఒకే ఒక్క పాజిటివ్ కేసు రావడం గమనార్హం. ఇలా కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పడుతోంది. అనేక రాష్ట్రాలు, జిల్లాల్లో జీరో స్థాయికి చేరింది కరోనా ప్రభావం.
మరి మరో వికృత రూపం దాల్చి కరోనా ఇబ్బంది పెట్టకపోతే.. ఈ విపత్తు నుంచి దేశం దాదాపు బయటపడినట్టేనేమో!