దేశ వాణిజ్య రాజధాని లాంటి నగరం ముంబైలో ఆది నుంచి కరోనా ప్రభావం తీవ్రంగానే ఉంది. దేశంలో కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి కూడా ముంబైలో చెప్పుకోదగిన స్థాయిలో కేసులు వస్తున్నాయి. సెకెండ్ వేవ్ తీవ్ర రూపం దాల్చింది ముందుగా మహారాష్ట్రలోనూ, ముంబైలోనే. రెండో వేవ్ లో మిగతా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెద్దగా నమోదు కాకముందే.. ముంబైలో కేసులు తీవ్ర స్థాయికి చేరాయి. ఆ తర్వాత కూడా ఆ ప్రభావం అలాగే కొనసాగింది. అంతే కాదు.. రెండో వేవ్ మిగతా చోట్ల తగ్గుముఖం పట్టినా.. ముంబైలో మాత్రం అంత తేలికగా తగ్గలేదు.
ఇక మూడో వేవ్ విషయంలో కూడా ముంబయి ముందు వరసలోనే నిలిచింది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. ఆ రాష్ట్రంలో మెజారిటీ కేసుల వాటా ముంబై నుంచినే వస్తున్నాయి.
ఈ సంగతలా ఉంటే.. మూడు రోజులుగా ముంబైలో కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతూ ఉండటం గమనార్హం. ఈ పరిణామం గురించి వైద్య పరిశోధకులు అంచనా వేస్తూ.. ముంబైలో మూడో వేవ్ తగ్గుముఖం మొదలైనట్టుగా అంచనా వేస్తున్నారు. మరో వారం రోజులు గడిస్తే పరిస్థితిపై పూర్తి స్పష్టత వస్తుందని చెబుతూనే, మూడో వేవ్ లో ముంబైలో కేసుల సంఖ్య పతాక స్థాయికి చేరినట్టే అని వారు అభిప్రాయపడుతున్నారు.
వరసగా శుక్ర, శని వారాల్లో పరిస్థితిని గమనించినా, అంతకు ముందు వారంతో గత వారం కేసులను బేరీజు వేసినా మూడో వేవ్ తగ్గుముఖం దిశగా సాగుతోందని వారు అంచనా వేస్తున్నారు. శుక్రవారం పదకొండు వేల స్థాయిలో కేసులు రాగా, శనివారం పది వేల స్థాయిలో కేసులు వచ్చాయి ఈ మహానగరం నుంచి. వారం లెక్కలను చూస్తే.. అంతకు ముందు వారంలో 43 వేల స్థాయిలో కేసులు రాగా, గత వారంలో 42 వేల స్థాయిలో కేసులు వచ్చాయి. పెరుగుదల కన్నా తగ్గుదల ఉన్న నేపథ్యంలో.. వేవ్ తగ్గుముఖం పడుతూ ఉండవచ్చనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే టెస్టుల సంఖ్య తగ్గి ఉంటే, నిర్ధారిత కేసుల సంఖ్య కూడా తగ్గి ఉండవచ్చు అనే మరో వాదనా ఉంది. కానీ, మూడో వేవ్ లో కేసులు దీర్ఘకాలం వచ్చే అవకాశం లేదనే అంచనాలు, అభిప్రాయాలున్న నేపథ్యంలో.. ముంబైకు ఉపశమనం దక్కుతూ ఉండవచ్చనే అభిప్రాయాలకూ ఆస్కారం ఏర్పడుతూ ఉంది.