దేశంలో కరోనా కారణ మృతుల సంఖ్య 60వేల స్థాయిలో ఉందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జనవరి 30న దేశంలో తొలి కరోనా కేసు రిజిస్టర్ కాగా.. ఆ తర్వాత కరోనా చాపకింద నీరులా వ్యాపించింది. లాక్ డౌన్ పరిణామాల్లో కరోనా వ్యాప్తి కొంత వరకూ తగ్గినా ఆ తర్వాత మాత్రం కరోనా అల్లుకుపోయింది. ఇప్పటి వరకూ పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారించిన కేసుల సంఖ్య 32 లక్షలకు పైనే ఉంది. వీరిలో కోలుకున్న వారి సంఖ్య దాదాపు 25 లక్షల వరకూ ఉంది. ఏడు లక్షల స్థాయిలో యాక్టివ్ పేషెంట్లున్నారు. కరోనా కారణ మరణాల సంఖ్య దాదాపు 60 వేలకు చేరింది.
స్థూలంగా కరోనా సోకిన వారిలో మరణాల రేటు 1.6 శాతం కన్నా తక్కువే ఉంది. మొదట్లో ఐదు శాతంగా ఉండిన ఈ రేటు క్రమక్రమంగా తగ్గింది. ప్రస్తుతం ఈ రేలు 1.58 శాతం వరకూ ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇండియాలో ప్రభుత్వ లెక్కల ప్రకారం.. కరోనా సోకిన ప్రతి రెండు వందల మందిలో ముగ్గురు మరణించారు ఇప్పటి వరకూ.
అందుకు సంబంధించి వయసుల వారీగా ఇచ్చిన జాబితా కరోనా ప్రభావంపై ఒక అంచనాకు రావడానికి అవకాశం ఇస్తోంది.
-కరోనాతో మరణించిన వారిలో 85 శాతం మంది వయసు 45కు పైనే! ఇలా ఆ వయసు వారికి కరోనా ఎంత ప్రమాదకరమో ఈ గణాంకం చెబుతోంది. దేశంలో 45 యేళ్ల పై జనాభా వారి శాతం 25 వరకూ ఉంది.
-14 సంవత్సరాల లోపు వయసు వారిపై కరోనా పెద్దగా ప్రభావం చూపలేకపోయిందని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కారణ మరణాల్లో 14 ఏళ్లలోపు వారి శాతం ఒకటిగా ఉంది. పసి మొగ్గలపై కరోనా ప్రభావం తక్కువనే ఊరటను ఇస్తోంది ఈ మాట.
-15 నుంచి 44 యేళ్ల మధ్య వయసు వారిపై కరోనా ప్రభావం పెరిగింది. ఇప్పటి వరకూ ఇండియాలో చోటు చేసుకున్న కరోనా కారణ మరణాల్లో ఈ వయసుల వారి శాతం 14గా ఉంది.
-45 నుంచి 59.. ఈ వయసు వారు కరోనా కారణంగా మరణించిన వారిలో ఎక్కువగానే ఉన్నారు. మొత్తం కరోనా కారణంగా మరణించిన వారిలో ఈ వయసు వారి శాతం 32.
-60-74.. దేశంలో కరోనా కారణంగా మరణించిన వారి లో ఈ వయసుల వారే చాలా ఎక్కువగా ఉన్నారు. మొత్తం కరోనా కారణ మరణాల్లో వీరి శాతం 39గా ఉందంటే ఈ వయసుల వారికి కరోనా ఎంత ప్రమాదకరమో స్పష్టం అవుతోంది.
-కరోనా మరణాల్లో 74.. ఆ పై వయసు వారి శాతం 14 అని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
-ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా కారణ మరణాల్లో 50 శాతానికి పైన 60 యేళ్ల పై వారివే అని ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని బట్టి 60 యేళ్ల పై వయసు వారు చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయం స్పష్టం అవుతోంది.
అయితే యుక్త వయసు వారు ఇప్పటికీ క్యారియర్స్ గా కొనసాగుతున్నారని, ఇలాంటి వారిలో చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకుండా కరోనా క్యారీ అవుతోందని, వీరి ద్వారా అది 60 దాటిన వారికి సోకినప్పుడు తీవ్ర రూపం దాలుస్తోందని అనేక పరిశీలనలు స్పష్టం చేస్తున్నాయి.