ఈ కరోనా ఉందే అనాలనిపిస్తోంది మరి. చూస్తూంటే పండుగలు, వేడుకలూ వరసపెట్టి కరోనా కోరలో పడిపోతున్నాయి. అన్నీ గత వైభవాలుగా మిగిలిపోతున్నాయి. విషయానికి వస్తే సింహాచలం అప్పన్నస్వామి వారి గిరి ప్రదక్షిణం ఉత్తరాంధ్రాలోనే అతి పెద్ద పండుగ.
ఆషాడ పౌర్ణిమ వేళ వేలాదిగా భక్తజనం అప్పన్నను స్మరించుకుంటూ సింహగిరి చుట్టూ ఉండే 32 కిలోమీటర్ల దూరాన్ని ప్రదక్షిణం చేస్తారు. అనంతరం స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటారు.
ఇది తరాలుగా వస్తున్న ఆచారం. ఈ గిరి ప్రదక్షిణకు ఉత్తరాంధ్రా జిల్లాల నుంచే కాదు, చుట్టుపక్కల ఉన్న నాలుగు రాష్ట్రాల నుంచి భక్తజనం పెద్ద ఎత్తున తరలివస్తారు.
దాదాపుగా మూడు రోజుల పాటు సాగే ఈ వేడుక స్వామి వారి చందనోత్సవం తరువాత అతి పెద్ద వేడుక. గత ఏడాది కరోనాతో ఈ వేడుక రద్దు అయింది.
ఇపుడు మూడవ దశ కరోనా సంకేతాలు నేపధ్యంలో మరోసారి రద్దు చేస్తున్నట్లుగా ఆలయ అధికారులు ప్రకటించారు. దీంతో అప్పన్న భక్తులు తీవ్ర నిరాశకు గురి అవుతున్నారు.
మొత్తానికి గత రెండేళ్ళుగా స్వామి వారి అన్ని ఉత్సవాలూ ఏకాంతంలో సాగుతున్నాయి. కరోనా నిబంధలను పాటించి భక్తుల దర్శనానికి మాత్రం అనుమతిస్తున్నారు.