ప్రాణానికి మించి క‌రోనా క‌బ‌ళిస్తున్నదేంటో తెలిస్తే…

మ‌నిషికి ప్రాణం త‌ర్వాతే ఏదైనా. అందుకే ప్రాణాల‌తో ఉంటే బ‌లిసాకు తినైనా బ‌త‌కొచ్చ‌ని పెద్ద‌లు చెబుతారు. డ‌బ్బు, ఆస్తులు, ఇత‌ర‌త్రా ఏవి పోగొట్టుకున్నా మ‌ళ్లీ సంపాదించుకోవ‌చ్చు. కానీ ప్రాణం పోగొట్టుకుంటే మ‌ళ్లీ తిరిగి సంపాదించుకునేది…

మ‌నిషికి ప్రాణం త‌ర్వాతే ఏదైనా. అందుకే ప్రాణాల‌తో ఉంటే బ‌లిసాకు తినైనా బ‌త‌కొచ్చ‌ని పెద్ద‌లు చెబుతారు. డ‌బ్బు, ఆస్తులు, ఇత‌ర‌త్రా ఏవి పోగొట్టుకున్నా మ‌ళ్లీ సంపాదించుకోవ‌చ్చు. కానీ ప్రాణం పోగొట్టుకుంటే మ‌ళ్లీ తిరిగి సంపాదించుకునేది కాదు క‌దా. అలాంటి ప్రాణం కంటే క‌రోనా క‌బ‌ళిస్తున్న ముఖ్య‌మైన అంశం మ‌రొక‌టి ఉంది. అదే మాన‌వ‌త్వం.

మ‌నిషి అంటేనే మంచి మ‌న‌సు. ద‌య‌తో స్పందించే హృద‌య‌మున్న ప్రాణి మ‌నిషి. గ‌త కొన్ని నెల‌లుగా క‌రోనా మ‌హ‌మ్మారి అమాన‌వీయ‌త గురించి మీడియాలో క‌థ‌లుక‌థ‌లుగా చ‌దువుకుంటున్నాం, చూస్తున్నాం. కానీ ఆ మ‌హ‌మ్మారి ధాటికి ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ‌త‌తో క‌ళ్ల‌ప్ప‌గించి చూడ్డం త‌ప్ప మ‌రేం చేయ‌లేకున్నాం.

నిన్న‌టికి నిన్న ఓ అమాన‌వీయ దృశ్యాన్ని చూశాం. గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో న‌డిరోడ్డుపై క‌రోనా రోగి కుప్ప‌కూలి ప్రాణాలు పోగొట్టుకోవ‌డం మ‌న‌సున్న‌ ప్ర‌తి ఒక్క‌ర్నీ క‌దిలించింది. క‌రోనా బారిన ప‌డిన 52 ఏళ్ల ఆ వ్య‌క్తి ట్రీట్‌మెంట్ కోసం ఆస్ప‌త్రికి వెళ్లేందుకు రోడ్డుపైకి వ‌చ్చాడు. అప్ప‌టికే అత‌ని స‌త్తువ‌ను క‌రోనా మ‌హ‌మ్మారి పీల్చి పిప్పి చేసింది. ఇక అడుగు ముందుకు వేయ‌లేక‌పోయాడు. న‌డిరోడ్డుపైన్నే అంద‌రూ చూస్తుండ‌గా కుప్ప‌కూలిపోయాడు.

అత‌ని మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు కుటుంబ స‌భ్యులు భ‌య‌ప‌డ్డారు. దీంతో శ‌వాన్ని న‌డిరోడ్డుపైనే వ‌దిలేసి ఇంటికెళ్లిపోయారు. బంధాలు, అనుబంధాల‌న్నీ క‌రోనా ముందు ఉత్తుత్తివే అని తేలిపోయింది. అన్నీ బాగుంటేనే అంద‌రూ. లేక‌పోతే ఈ లోకంలో ఎవ‌రికి ఎవ‌రు? అనేందుకు ఇదే నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలిచింది. చ‌చ్చిన వాడి కోసం తాము చావులేమ‌ని కుటుంబ స‌భ్యుల నిర్ణ‌య‌మే నిర్ద‌య‌గా శ‌వాన్ని న‌డిరోడ్డుపై వ‌దిలి వెళ్లేలా చేసింద‌న‌డంలో సందేహం లేదు.

ఏ దిక్కూలేని అనాథ శ‌వ‌మైతే ప్ర‌భుత్వాన్ని నిందించ‌వ‌చ్చు. కానీ ఇక్క‌డ అలాంటి ప‌రిస్థితి కాదు. క‌ళ్ల ముందు క‌రోనా హ‌త్య‌ను చూస్తూ…తామూ దానికి బ‌లి కావ‌డానికి ఎవ‌రు మాత్రం ముందుకొస్తారు? స‌త్తెన‌ప‌ల్లెలో మూడు గంట‌ల‌పాటు ప‌డి ఉన్న శ‌వాన్ని చివ‌రికి మున్సిప‌ల్ సిబ్బంది శ్మ‌శాన వాటిక‌కు త‌ర‌లించి దేవుళ్ల‌ను త‌ల‌పించారు.  

ఇదిలా ఉంటే మ‌న‌కు తెలిసి ఒక్క స‌త్తెన‌ప‌ల్లే. మ‌న‌కు తెలియ‌ని, వెలుగులోకి రాని ఇలాంటి ఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. స‌హ‌జంగా మ‌నిషికి అంతిమ సంస్కారం అనేది ఎంతో గౌర‌వంగా నిర్వ‌హిస్తారు. ప‌ట్ట‌ణాల్లో మ‌నుషుల మ‌ధ్య సంబంధాలు అంత‌గా ఉండ‌వు. ప‌క్కింట్లో ఏం జ‌రుగుతున్న‌దో ఎవ‌రికీ తెలియ‌దు. కానీ ప‌ల్లెల్లో అందుకు విరుద్ధంగా. ప‌ర‌స్ప‌రం అభిమానంగా ఉంటారు. ప్ర‌స్తుతం క‌రోనా పుణ్య‌మా అని గ్రామీణ ప్రాంతాల్లో ప‌రిస్థితి ఘోరంగా త‌యారైంది. క‌రోనాకు ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఎవ‌రైనా చ‌నిపోతే….ఊరంతా ద‌గ్గ‌రుండి అంతిమ సంస్కారం ఘ‌నంగా నిర్వ‌హించేవారు. ప్ర‌స్తుత క‌రోనా కాలంలో మామూలు రోగంతో చ‌నిపోయినా…క‌నీసం చూసేందుకు కూడా వెళ్ల‌ని ద‌య‌నీయ స్థితి.

దీంతో కుటుంబ స‌భ్యులు, ఎంతో ద‌గ్గ‌రి వాళ్లైతే త‌ప్ప శ‌వాల్ని చూడ‌డానికి వెళ్ల‌ని ద‌య‌నీయ , అమాన‌వీయ ప‌రిస్థితులు నెల‌కున్నాయి. ఒక్క చావు లాంటి అశుభాల‌కే కాదు, పెళ్లిలాంటి శుభ కార్యాల‌ది అదే ప‌రిస్థితి. ప్ర‌భుత్వ నిబంధ‌నల ప్ర‌కారం అటు వైపు 20 మంది, ఇటు వైపు 20 మంది మాత్ర‌మే హాజ‌రై తంతు ముగించాలి.

కొంద‌రు ఈ నిబంధ‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండా ఓ మోస్తారుగా పెళ్లి చేయాల‌నుకుంటున్నారు. ఇటీవ‌ల క‌డ‌ప‌లో ఓ పెళ్లికి 500 మందికి భోజ‌నాలు త‌యారు చేశారు. తీరా పెళ్లికి 30 మందికి మించి రాలేదు. దీంతో పెళ్లి నిర్వాహ‌కులు ల‌బోదిబోమ‌న్నారు. అస‌లు త‌మ‌కు పెళ్లి పిలుపు రాక‌పోవ‌డ‌మే మంచిద‌ని భావిస్తున్నారంటే….క‌రోనా ఎంత భ‌య‌పెడుతున్న‌దో అర్థం చేసు కోవ‌చ్చు.

పెళ్లికి పిలిస్తే పోలేద‌నుకుంటార‌నే బాధ వెంటాడుతున్న‌ద‌ని సామాన్య జ‌నం అభిప్రాయం. మ‌రోవైపు క‌రోనా పెళ్లిళ్లు దొంగ పెళ్లిళ్ల‌ను త‌ల‌పిస్తున్నాయ‌ని సెటైర్లు వేస్తున్నారు. మ‌నిషిని మ‌నిషి న‌మ్మ‌లేని దుస్థితిని క‌రోనా క‌ల్పించింది. ఇదో విచిత్ర ప‌రిస్థితి. క‌రోనాకు వ్యాక్సిన్ వ‌చ్చేంత వ‌ర‌కు స‌మాజంలో ఇలాంటి దుస్థితే ఉంటుంది. 

చిలుకూరు ఆల‌యంలో అద్భుతం