కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే శిల్పాచక్రప్రాణిరెడ్డి కరోనా బారిన పడ్డారనే విషయాన్ని మరిచిపోకనే మరికొందరిని ఆ మహమ్మారి అటాక్ చేసిందనే సమాచారం ఆందోళన కలిగిస్తోంది. కరోనా బారిన పడ్డవారంతా సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు.
చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్నిహితులు కరోనా బారిన పడి ఆస్పత్రి పాలయ్యారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి జగన్‌కు ప్రియ శిష్యులనే విషయం తెలిసిందే.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన భార్యకు వైద్య పరీక్షలు నిర్వహిం చగా ఆమెకు పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శ్రీకాళహస్తిలో కరోనా మొదటి నుంచి విజృంభిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాళహస్తిలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారంటూ ఎమ్మెల్యేపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాయి. ప్రస్తుతానికి వస్తే బియ్యపు మధుసూదన్‌రెడ్డి దంపతులు అమరరాజా వైద్యశాలలో చేరారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని తెలిసింది.
ఇక చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చిన్న కుమారుడు హర్షిత్ కూడా కరోనా బారిన పడ్డాడు. రాజకీయాల్లో తండ్రికి చేదోడుగా పెద్ద కుమారుడు మోహిత్, చిన్న కుమారుడు హర్షిత్ ఉంటున్నారు. చంద్రగిరి నియోజకవర్గ రాజకీయాలను గత కొంత కాలంగా చెవిరెడ్డి కుమారులు సమన్వయపరచుకుంటున్నారు. కరోనా బారిన పడిన చెవిరెడ్డి చిన్న కుమారుడు ప్రస్తుతం ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు.