కరోనా పీడ మొదలయ్యాకా.. మనుషుల జీవనశైలే చాలా వరకూ మారిపోయింది. దాదాపు ఏడాదిన్నర కాలం ఇబ్బందికరంగానే గడిచిపోయింది. ఇప్పుడు విశేషం ఏమిటంటే.. మళ్లీ పాత రోజులు వచ్చేసిన దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. మళ్లీ మంచి రోజులు వచ్చినట్టేనా.. అనే ఆరా తీసే సమయం వచ్చింది. దసరా పండగ పరిస్థితులను గమనిస్తే.. ఓ మోస్తరు పట్టణ స్థాయిల్లో ప్రజలు చాలా రిలాక్డ్స్ గా తిరుగుతున్నారు.
పండగలకు బంధువుల ఊళ్లకు వెళ్లే పరిస్థితులు మళ్లీ రావడమే ఈ సారి దసరా స్పెషల్. దాదాపుగా ఏడాదిన్నర నుంచి ఎవరైనా బంధువుల ఊళ్లకు వెళ్లడానికి కూడా వెనుకాడే పరిస్థితి. ఇరు వైపుల వారి క్షేమాన్ని దృష్టిలో ఉంచుకున్న వాళ్లంతా ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. ఇంటికి కావాల్సిన వాళ్లు అనుకోకుండా వచ్చినా ఆప్యాయంగా ఆదరించే పరిస్థితి లేకుండా పోయింది. పల్లెలు కూడా ఈ పరిస్థితికి మినహాయింపు కాదు.
శుభకార్యాలు, పెళ్లిళ్లకే పరిమిత స్థాయిలో బంధుమిత్రులు వెళ్లే పరిస్థితి ఏడాదిన్నర పాటు కొనసాగింది. కరోనా ఫస్ట్ వేవ్ తొలి మూడు నాలుగు నెలలూ పక్కింటికి వెళ్లడానికి కూడా వెనుకాడే పరిస్థితి. ఆ తర్వాత గత ఏడాది నవంబర్, డిసెంబర్ సమయానికి ప్రజలు కాస్త రిస్కే అయినా ముందుకు కదిలారు. అయితే సెకెండ్ వేవ్ తో ప్రజలు బెంబేలెత్తిపోయారు.
సెకెండ్ వేవ్ దాదాపు నాలుగైదు నెలల పాటు భయపెట్టింది. ఆ సమయంలో ప్రజల్లో కూడా ఒకరమైన జాగ్రత్త మొదలైంది. మాస్కులు , శానిటైజర్ల వినియోగం సాగింది. అదే సమయంలో.. బంధువుల ఇళ్లకూ, వివాహాది శుభకార్యాలకు హాజరు కావడాన్ని చాలా రిస్క్ గానే భావించారు అంతా. అయితే ఆ పరిస్థితుల్లో కూడా కొందరు రిస్క్ తీసుకున్నారు. కానీ, చాలా పరిమితుల మధ్యన కదిలారంతా.
వెయ్యి మందితో జరగాల్సిన పెళ్లిళ్లు వంద మందితో జరగడం గొప్పగా మారింది. ఇక బంధాలు, బంధుత్వాలను ప్రజలు తప్పనిసరిగా పక్కన పెట్టుకోవాల్సిన పరిస్థితిని కల్పించింది కరోనా భయం. అయితే ఆ పీడకల అంతా దాదాపు ముగిసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది క్షేత్ర స్థాయిలో. అందుకు దసరా సందర్భం బాగా ఉపయోగపడినట్టుగా ఉంది. దసరా షాపింగుల విషయంలో కానీ, పండగ సందర్భంగా ప్రయాణాల విషయంలో కానీ.. ప్రజలు ధైర్యంగా ముందడుగు వేశారు. కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిపోవడం.. ఇక కరోనా పీడ విరగడ అయినట్టే అని ప్రజలు భావిస్తూ ఉన్నారు.
అక్టోబర్ లో మూడో వేవ్ అనే అంచనాల సంగతేమో కానీ.. ఇదే అక్టోబర్ లో గ్రామాల్లో, పట్టణాలు, ఓ మోస్తరు నగరాల్లో.. ప్రజలు ఈజీగా మూవ్ అవుతున్నారు. మాస్కుల పట్టింపులు, కొత్త వాళ్లు వస్తే పలకరించడానికి కూడా వెనుకాడే పరిస్థితులు పోతున్నాయి. ఇక అవగాహన, ఆసక్తి ఉన్న వాళ్లు..రెండు డోసుల వ్యాక్సినేషన్ ను కూడా పూర్తి చేసుకున్నారు.
మరి కొందరేమో ఇక ఏ వ్యాక్సిన్ అవసరం లేదనేంత ధీమాను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రజల కాన్ఫిడెన్స్ ను గమనిస్తే మాత్రం.. కరోనాకు ఇక భయపడేది లేదన్నట్టుగా ఉంది. మరి ఈ ధీమాతో.. మంచి రోజులు వచ్చినట్టేనా, ఆ మాట చెప్పడానికి మరి కొన్ని నెలల గడువు అవసరమో!