కరోనా వైరస్‌పై అంచనాలు తప్పుతున్నాయా.?

వేసవి కాలం కారణంగా ఎండల తీవ్రత పెరగడంతో కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త నెమ్మదించే అవకాశాలున్నాయంటూ కొన్ని విశ్లేషణలు కన్పిస్తున్నాయి. కానీ, అందుకు బిన్నంగా దేశంలో కరోనా వైరస్‌కి సంబంధించి పాజిటివ్‌ కేసులు గణనీయంగా…

వేసవి కాలం కారణంగా ఎండల తీవ్రత పెరగడంతో కరోనా వైరస్‌ వ్యాప్తి కాస్త నెమ్మదించే అవకాశాలున్నాయంటూ కొన్ని విశ్లేషణలు కన్పిస్తున్నాయి. కానీ, అందుకు బిన్నంగా దేశంలో కరోనా వైరస్‌కి సంబంధించి పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. నిజానికి, ఈ పరిస్థితిని కేంద్రం ముందుగానే ఊహించింది. అందుకు తగ్గట్టే లాక్‌ డౌన్‌ ప్లాన్‌ని తెరపైకి తెచ్చింది. దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ విజయవంతంగా నడుస్తున్నా, కొన్ని చోట్ల జనం ‘లాక్‌ డౌన్‌’ని పట్టించుకోకుండా రోడ్ల మీదకు వస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఈ రోజు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా వేగంగా పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఎక్కువగానే కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 15 కేసులు నమోదైతే, ఆంధ్రప్రదేశ్‌లో ఏకంగా 20కి పైగా కేసులు నమోదవడం గమనార్హం. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీల్లో అయితే ఈ పెరుగుదల చాలా చాలా ఎక్కువగా కన్పించింది. ఢిల్లీలోని ఓ మతానికి సంబంధించిన సదస్సులో పాల్గొని వచ్చినవారి కారణంగానే కేసుల పెరుగుదల ఎక్కువగా నమోదయినట్లు ఆయా రాష్ట్రాలు విడుదల చేసిన అధికారిక హెల్త్‌ బులెటిన్స్‌తో స్పష్టమవుతోంది.

సదరు సదస్సుకి వెళ్ళినవారిని గుర్తించే దిశగా దేశంలోని పలు రాష్ట్రాలు యుద్ధ ప్రాతిపదికన కసరత్తులు షురూ చేసింది. స్వచ్ఛందంగా ఆసుపత్రులకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిస్తూనే, ఇంకో వైపు వారిని గుర్తించి, ఆసుపత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం వుందని కేంద్రం కూడా ఓ అంచనాకి వచ్చేసింది.

నిజానికి, ఏప్రిల్‌ 7తో తెలంగాణలో కొత్త కేసుల నమోదు ఆగిపోతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ మధ్యనే చెప్పారు. నిజంగానే అది జరుగుతుందా.? అంటే, ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమేనని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా వుండకపోవచ్చు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్నా, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోల్చితే, మన దేశంలో కేసుల పెరుగుదల రేటు తక్కువగానే వుందని కేంద్రం చెబుతోంది.

ఏమో.. రోజురోజుకీ అంచనాలు తప్పుతున్న దరిమిలా, రానున్న రోజుల్లో కరోనా వైరస్‌ దెబ్బకి దేశం ఏ స్థాయిలో విలవిల్లాడాల్సి వస్తుందోనని దేశ ప్రజానీకం ఆందోళన చెందుతోంది.

దేవినేని ఉమని ఉతికి ఆరేసిన కొడాలి నాని

ఇన్ని రోజులు ఒక ఎత్తు ఈ నాలుగు రోజులు ఒక ఎత్తు