కరోనా థర్డ్ వేవ్‌పై రకరకాల భయాలున్నాయి. మరోవైపు కరోనా సెకెండ్ వేవ్ ఇంకా కొనసాగుతూ వుందనే ప్రకటన. మహమ్మారి మూడో దఫా పంజా విసురుతుందనే హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ తాజా హెచ్చరికలను ప్రతి ఒక్కరూ విని, పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు మున్ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది.
కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ కరోనాపై మున్ముందు ఎలా వ్యవహరించాలో చెప్పుకొచ్చారు. రానున్న రెండు నెలలు ఎంతో కీలకమని కేంద్రం అప్రమత్తం చేసింది. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అనేక పండుగలు ఉండటంతో కరోనా నియంత్రణలో ఆ రెండు నెలలే అత్యంత కీలకమని స్పష్టం చేయడం గమనార్హం.
కరోనాను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుని పండుగలు జరుపుకోవాలని కేంద్రం ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. వ్యాక్సిన్లు వ్యాధి నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తాయన్నారు. వ్యాక్సినేషన్ తర్వాత ప్రతిఒక్కరూ మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని తేల్చి చెప్పారు.
ఇదిలా వుండగా, దేశం కోవిడ్ సెకెండ్ వేవ్ మధ్యలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్నారు. నిన్న నమోదైన 46 వేల కొత్త కేసుల్లో దాదాపు 58శాతం కేరళలోనే వెలుగు చూసినట్టు ఆయన పేర్కొన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో కోవిడ్ తగ్గుదల ట్రెండ్ కనబడుతోందనడం గమనార్హం. ప్రస్తుతం కరోనా ప్రభావం అంతగా లేకపోవడంతో, ఇక పోయిందనే అజాగ్రత్త పనికి రాదనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది.
గతంలో ఫస్ట్ వేవ్ సమయంలో కూడా తగ్గిపోయిందని అందరూ భావించి రిలాక్స్ అయ్యారు. ఆ తర్వాత పంజా విసరడంతో లబోదిబోమన్నారు. ఫస్ట్ వేవ్ కంటే సెకెండ్ వేవ్ ఎక్కువ ప్రాణ నష్టం కలిగించింది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ తప్పదనే హెచ్చరికల నేపథ్యంలో …నివారణ చర్యలు తప్ప మరో మార్గం లేదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు సూచిస్తున్నారు. వైద్య నిపుణుల సూచనలు, సలహాలను కొట్టి పారేయకుండా ప్రతి ఒక్కరూ ఆచరించాల్సిన అవసరం ఎంతో ఉంది.